బీఆర్ఎస్ పార్టీకి భూముల టెన్షన్ పట్టుకుంది. హైకోర్టుకు సైతం ధైర్యంగా భూములు కేటాయింప చేసుకున్నామని చెప్పలేకపోతోంది. కోకాపేటలో బీఆర్ఎస్ ట్రైనింగ్ సెంటర్ కు.. కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ భూములు కేబినెట్ కేటాయించారన్న విషయాన్ని ధైర్యంగా హైకోర్టుకు చెప్పలేకపోతున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టిందని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణలో క్యాబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయం తర్వాత జీవో జారీచేస్తామని పేర్కొంది.
0రూ.500 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కనీసం మార్కెట్ ధరతో కూడా సంబంధం లేకుండా ఎకరాకు రూ.3.41 కోట్లకు కేటాయించారని.. ఈ కేటాయింపునకు సంబంధించిన జీవోగానీ, ఆదేశాలుగానీ ప్రభుత్వ వెబ్సైట్లలో ఎక్కడా అందుబాటులో లేవని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. కారుచౌకగా భూమికేటాయించడానికి ఎలాంటి కారణం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ కేటాయింపుపై క్యాబినెట్ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని.. జీవో కూడా జారీ అయిందని.. కానీ జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోర్టులో వాదించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
నిజానికి బీఆర్ఎస్ కు భూమి కేటాయింపు అనేది అందరికీ తెలిసిన నిజం. కేసీఆర్ తమ పార్టీ ట్రైనింగ్ సెంటర్ కోసమంటూ శంకుస్థాపన కూడా చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అఘమేఘాల మీద అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని కూడా బయటకు వచ్చింది. కానీ కోర్టుకు చెప్పేందుకు మాత్రం ప్రభుత్వం జంకుతోంది. అంటే.. ఏదో తేడా ఉన్నట్లేగా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.