హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఓడిపోయినందున బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓడిపోతుందని ఇప్పటి నుండే జోస్యం చెబుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ మొదట్లో హర్యానాలో లీడ్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంది కానీ బీజేపీ పుంజుకుందని తెలిసిన తర్వాత ఆగలేదు. కాంగ్రెస్ పై సెటైర్లు వేయడం ప్రారంభించారు.
ఫలితాలు డిక్లేర్ అయిన తర్వాత కేటీఆర్ . కాంగ్రెస్ ఏడు గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని తేల్చేశారు. అక్కడి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పాలనను చూసి అంతా మోసం అని నిర్దారించుకున్నారని అందుకే ఓట్లేయలేదని విశ్లేషించారు. కశ్మీర్ లో బీజేపీ గెలవలేదని అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది కాబట్టి .. ఇక ప్రాంతీయ పార్టీలదే రాజ్యమని కేటీఆర్ చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడితే బీజేపీదే విజయమని.. ప్రాంతీయ పార్టీలతో తలపడితే మాత్రం ప్రాంతీయ పార్టీలే గెలుస్తున్నాయని కేటీఆర్ విశ్లేషించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
నిజానికి ఇప్పుడు కూడా కేంద్రంలో ప్రాతీయ పార్టీల వల్లనే ప్రభుత్వం ఉంది. కేటీఆర్ కు ఆ విషయం గుర్తుంది కానీ.. తమ పార్టీకి మంచి సీట్లు వచ్చి తమ బలంతోనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడితేనే అది ప్రాంతీయ పార్టీలకు లభించిన సాధికారతగా భావిస్తారేమో కానీ.. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటోంది. మరి బీజేపీ గెలుపును ఎలా తీసుకుంటోందో మరి ?