తెలంగాణ రాజకీయాల్లో ఫామ్ హౌస్ మరోసారి సంచలనం అయింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు పేరుతో అప్పటి పోలీసులు స్సెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దాంతో ఫామ్ హౌస్ కేసుగా అది ప్రసిద్ధి పొందింది. తాజాగా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కేసు ఫామ్ హౌస్ కేసుగా ప్రజల నోళ్లలో నానుతోంది. కేసు తీవ్రతలో చాలా తేడా ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ రింగ్ మాస్టర్ అయితే.. ఇక్కడ మాత్రం నిందితురాలు లేదా బాధితురాలు అనుకోవచ్చు. అయితే ఈ సిట్యూయేషన్ను సమర్థంగా ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. ఫలితంగా ఇమేజ్ డ్యామేజ్ అయింది.
నిఘా ఉంటుందని తెలిసినా నిర్లక్ష్యంగా పార్టీ
గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలతో చూసుకుంటే బాధితులు అయిన ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు. అలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ పెద్దల కుటుంబసభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంట్లోకి వచ్చి ఎవరు చూస్తారులే అనుకున్నారు. కానీ తప్పటడుగు వేశారు. అదే సమయంలో పోలీసులు దాడి చేసినప్పుడు అయినా క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాల్సింది. తమ పార్టీపై దాడి చేసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేక ప్రచారం మీడియాలో జరుగుతుందని ఊహించి.. తమ ఫ్యామిలీ పార్టీపై పోలీసులు దాడి చేశారని ముందుగానే ఎదురుదాడి చేయాల్సింది. కానీ అలా చేయలేకపోయారు.
పోలీసులు తలుపు తట్టగానే పారిపోవడం పెద్ద మైనస్
కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసులు కూడా వ్యూహాత్మకంగా ఈ ఫామ్ హౌస్ కేసులో అరగంటకో విషయం చెబుతూ ఆసక్తి పెంచారు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందన్నట్లుగా ప్రచారం చేశారు. రేవ్ పార్టీ అని పోలీసులు చెప్పలేదు . కానీ మీడియాలో ప్రచారం జరిగింది . రేవ్ పార్టీ అంటే ప్రజల్లో ఎవరికి వారు తాము అనుకున్న అర్థాలు తీసుకుంటారు. ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. ఊహించే సరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత రాజ్ పాకాల పారిపోవడంతో ఏదో ఉందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసుకున్నారు. సాయంత్రానికి అది ఫ్యామిలీ దావత్ అని ఎదురుదాడి ప్రారంభించారు.
ఫ్యామిలీ దావత్ అని ఎంత వాదించినా డ్యామేజ్ అయిపోయింది !
ఇప్పటికీ అది ఫ్యామిలీ దావత్ అని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఉన్న ఇమేజ్.. ఫామ్ హౌస్ పార్టీలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం… రాజ్ పాకాల పారిపోవడం అన్నీ కలిపి అక్కడ జరగకూడని పార్టీ జరిగిందని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. పోలీసులు ఎటాక్ చేసినప్పుడే అసలు జరగబోయే ప్రమాదాన్ని… ప్రచారాన్ని అంచనా వేసుకుని రివర్స్ ఎటాక్ ప్రారంభించి ఉంటే ఫలితం ఉండేది. కానీ ఇప్పటికే చేయిదాటిపోయింది.