బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు నాందేడ్ దాటి ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ తెలంగాణ అవతల మొదటి సభ నాందెడ్ లో నిర్వహిస్తే.. ఈ సారి కూడా అదే జిల్లాలో వేరే చోట నిర్వహిస్తున్నారు. రెండో మీటింగ్‌ని కూడా సరిహద్ధున ఉన్న మరాఠా జిల్లాలోనే పెట్టాలని నిర్ణయించారు. మరి కొంతమంది మరాఠా నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకే ఈ బహిరంగసభను తలపెట్టారు. కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు.
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చారు. మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే పలువురు ఇతర ఎన్సీపీ నేతలతో కలిసి వచ్చి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరతామని చెప్పారు. ఈ మేరకు బహిరంగసభ ఏర్పాటు చేశారు.
నిజానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణకు ఎవరూ మద్దతివ్వని సమయంలో ఆయన కేసీఆర్ కు మద్దతిచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున కేసీఆర్ ఆకర్షిస్తున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. నాందేడ్ సభకంటే ముందు జనవరి నెలలో ఒడిషా నేతలు బస్సుల్లో తరలివచ్చి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్, భార్య హేమ గమాంగ్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ అక్కడ బహిరంగసభ పెట్టే ఆలోచన ఇంకా చేయలేదు. ఏపీలోనూ అంతే. సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాలపైనే కేసీఆర్ గురి పెట్టడానికి కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది.