రాజకీయం అంటే ఎదురునిలబడి కొట్లాడటం కాదు. ఎదుటి సైన్యంలో కీలకమైన వ్యక్తుల్ని, లీడర్లని వారితోనే అస్త్రసన్యాసం చేయించడం అనే వ్యూహం కూడా ఒకటి. ఇప్పుడు బీఆర్ఎస్ తమ ప్రత్యర్థి పార్టీలపై అదే చేస్తున్నాయి. తమను చిరాకు పెట్టి బీజేపీని గెలిపించేస్తాడేమో అన్న అభిప్రాయాన్ని కల్పించిన బండి సంజయ్ ను బీజేపీ పక్కన పెట్టడంలో బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎవరూ కాదనలేరు. ఇప్పుడు అదే పద్దతిని కాంగ్రెస్ మీద ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డిని .. కాంగ్రెస్ కు కరెక్ట్ కాదని.. ఆయన వల్ల కాంగ్రెస్ కు డ్యామేజ్ జరుగుతోదంని బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఆవేదన చెందుతూండటం ఇందులో భాగమే.
తెలంగాణలో రేవంత్ రెడ్డిని మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా అనుకుంటోంది. అందుకే ఆయనే టార్గెట్ గా రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఆయనపై నమ్మకం తగ్గించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడిన అంశంపై చంద్రబాబు, టీడీపీకి లింక్ పెట్టడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన తీసుకు రావడం ద్వారా బీఆర్ఎస్ ఆశించిన రాజకీయ ప్రయోజనం.. కేవలం రేవంత్ రెడ్డిపై హైకమాండ్ విశ్వాసం తగ్గించడమేనంటున్నారు. గతంలో శశిథరూర్ విషయంలో కూడా కాంగ్రెస్ మంచిదే.. కానీ రేవంత్ కరెక్ట్ కాదన్నట్లుగా నేరుగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేతలు ఎప్పుడు హైదరాబాద్ లేదా తెలంగాణ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి సరైనచాయిస్ కాదని చెప్పేందుకే కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియాంకా గాంధీ యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సమయంలో కేటీఆర్ మరోసారి అదే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని … గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని అన్నారు.
నిజానికి బీఆర్ఎస్ పెద్దలు తమకు ఎదురు నిలుస్తున్న నేతలపై ఇలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారు. బండి సంజయ్ ను తప్పించిన తర్వాత బీజేపీ రేసులోనుంచి పోయింది. ఒక వేల కాంగ్రెస్ కూడా ఆబీర్ఎస్ ట్రాప్ లో పడితే.. అసలు ఎన్నికలు లేకుండానే బీఆర్ఎస్ గెలిచేసినట్లు అవుతుంది. కానీ కేటీఆర్, బీఆర్ఎస్ కు ఉన్నన్ని రాజకీయ తెలివితేటలు… ఇతర పార్టీలకు ఉండవని అనుకోవడం అమాయకత్వమేనని… గ్రాండ్ ఓల్డ్ పార్టీకి రాజకీయాలు నేర్పాలనుకోవడం.. తాతకు దగ్గులు నేర్పడమేనన్న సెటైర్లు .. కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి.