మూసి ప్రక్షాళన విషయంలో కేటీఆర్ రెండు రోజుల పాటు హడావుడి చేశారు. ప్రభుత్వం మార్కింగ్ చేసిన ప్రతి ఇంటి మీద కేసీఆర్ అని రాయాలని..ఎవరు ఆ ఇంటి జోలికి వస్తారో చూద్దామని సవాల్ చేశారు. మూసి నదిలో ఇళ్లు కట్టుకున్న వారిని ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలియదు కానీ..గతంలో ఇదే కేటీఆర్ మూసి ప్రక్షాళన కోసం తమ ప్లాన్లను అసెంబ్లీలో వెల్లడించిన వీడియోలు మాత్రం వైరల్ అయ్యాయి.
మూసి ప్రక్షాళన అనేది రేవంత్ రెడ్డి టాస్క్ గా తీసుకున్నారు. కాకపోతే ఆయన ఆలోచనలు చాలా భారీగా ఉన్నాయి. ఓ రివర్ సిటీగా మార్చాలన్నది ఆయన ఆలోచన. బీఆర్ఎస్ ఇంత భారీగా కాకపోయినా మూసిని ప్రక్షాళన చేసి మంచి నీటి నదిలా మార్చాలని అనుకుంది . చాలా సార్లు తమ ఆలోచనలు చెప్పింది. కాన కాళేశ్వరానికి డబ్బులన్నీ సరిపోలేదేమో కానీ మూసి మీద దృష్టి పెట్టలేదు.
ఒక వేళ కేసీఆర్ మరోసారి సీఎం అయి ఉంటే ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేసి ఉండేవారని.. వారు ఆక్రమణలు తొలగించకుండా .. చేసేవారా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ఆ ఇళ్లన్నీ మూసికి వరద వచ్చినప్పుడు మురికినీటిలో మునిగిపోతూంటాయి. మూసారాంబాగ్ తో పాటు చాదర్ ఘాట్ మూసి నదిపై వంతెన నిండా నీళ్లు వస్తూంటాయి. ఇతర చోట్లా చెప్పాల్సిన పని లేదు. వారిని రెచ్చగొట్టడం ద్వారా బీఆర్ఎస్ ఏం సాధిస్తుందన్న ప్రశ్న సహజంగానే కాంగ్రెస్ వైపు నుంచి వస్తోంది.