భారత రాష్ట్ర సమితి రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ప్రతిపక్షంగా తాము పోరాడుతున్నా ప్రజల్లో తమ వైపు సానుభూతి కనిపించకపోవడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు ప్లీనరీని వేదికగా చేసుకోవాలని అనుకుంటున్నారు. పార్టీ పెట్టి పాతికేళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని మరోసారి ఉద్యమ నాటి వేడిని ప్రజల్లోకి నింపాలని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. అదే బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇంకా బయటకు రాని బీఆర్ఎస్ క్యాడర్
జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ ఎక్కడా జరగలేదు. తూ తూ మంత్రంగా కూడా జరిపేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపించలేదు. కవితను అరెస్టు చేసినప్పుడు ముఖ్య నేతలు కూడా పట్టించుకోలేదు. ముఖ్య నేతలు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నా వచ్చే కార్యకర్తల సంఖ్య తక్కువగానే ఉంటుంది. నల్లగొండలో నిర్వహించిన రైతు సభకు హాజరైన జనం చూసి ఏవీ నాటి జన సమూహాలు అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.
పార్టీ భవిష్యత్ పై సందేహాల్ని తీర్చలేకపోతున్న నాయకత్వం
పార్టీ భవిష్యత్ పై సొంత ముఖ్యనేతలే అనుమానాలు వ్యక్తం చేయడంతో పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని ఓ సమావేశంలో కేసీఆర్ సొంత నేతలపై మండిపడ్డారన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ భవిష్యత్ పై పై స్థాయి నేతల్లో కూడా సందేహాలు ఉన్నాయని ఈ మాటలు నిరూపిస్తున్నాయి. మరి కింది స్థాయిలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో పార్టీ అగ్రనాయకత్వం ఏం చేయాలి.. పార్టీ భవిష్యత్ కు ఢోకా లేదన్న నమ్మకం కలిగించాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా .. మాటలు చెబితే అలాంటి ధైర్యం ఎలా వస్తుంది ?
జిల్లాలకు కేటీఆర్ – యాక్టివ్ చేయగలరా ?
కేటీఆర్ జిల్లాలలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలు తిరిగి పార్టీ క్యాడర్ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ ప్లీనరీ సభకు భారీ జన సమీకరణ చేసి సత్తా చాటడంతో పాటు అందరూ మళ్లీ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేసేలా చేయాలనుకుంటున్నారు. అయితే ఎంత వరకు ఆయన సక్సెస్ అవుతారన్నదే కీలకం. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు కనీస హైప్ రావడం లేదన్నది మాత్రం నిజం.