” పార్టీలు మారడం అనేది సీరియస్ మ్యాటర్ కాదు.. అత్తగారి ఇల్లు.. తల్లిగారి ఇల్లులా రాజకీయాలు మారాయి. ఈ విషయంపై పదేపదే చర్చించడం అనవసరం ” అని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందని పదే పదే విమర్శలు చేయడం.. ఆరోపణలు చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల్ని ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారని గుర్తు చేస్తున్నారు. జగ్గారెడ్డి నిఖార్సుగా అభిప్రాయం చెప్పారు. అందులో వంద శాతం నిజం ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారు.
గతంలో విపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా… పవర్ ఉండేది. ప్రభుత్వాలు ..ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రోటోకాల్ కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేగా గుర్తించేందుకు ఆసక్తి చూపించడం లేదు. అధికారులు ఎవరూ ఎమ్మెల్యే మాట వినరు. ఆయా పార్టీల ఇంచార్జ్ అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతాడు. ఆయన చెప్పిందే వేదం.. గెలిచిన ఎమ్మెల్యే డమ్మీ. బీఆర్ఎస్ హయాంలో ఇది ఇంకా ఎక్కువ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోంది. దీంతో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉక్కపోత తప్పడం లేదు. అందుకే వారికి ప్రోటోకాల్ ఇప్పించాలని స్పీకర్ దగ్గరకు వెళ్లారు.
అయితే ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీనే. తాము ఓడిపోయే ప్రశ్నే ఉండదన్న అహంకారంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ వారే ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చన్న ఆలోచన తెచ్చుకునికాస్త జాగ్రత్తగా వ్యవస్థల్ని కాపాడి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు. గతంలో మీరు చేసి.. ఇప్పుడు కాంగ్రెస్ చేయకూడదని రోడ్లెక్కితే ప్రజలు ఎలా సమర్థిస్తారన్న చిన్న లాజిక్ ను కేటీఆర్, బీఆర్ఎస్ మర్చిపోతోంది. అదే అసలు సమస్య.