ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రతిపక్ష పాత్ర. మీడియా తప్పు ఒప్పులు ఎత్తి చెప్పడం అనాదిగా వస్తోంది. ప్రభుత్వంతో ఎంత సన్నిహిత సంబంధాలున్నా… ప్రశ్నించడం మాత్రం చేస్తూనే ఉంటారు. కానీ ఇటీవల ఆ ధోరణి మారిపోయింది. ప్రభుత్వం అడ్డగోలు తప్పులు చేసినా ప్రశ్నించకపోగా.. గతంలోనూ అలాగే చేశారంంటూ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సొంత వర్గం మీడియా రెడీ అయిపోతోంది. అధికార పార్టీలు టార్గెట్ చేయాలనుకున్న నేతలపై దారుణంగా బరద చల్లేందుకూ వెనుకాడటం లేదు. ఇలాంటి మీడియా అండగా ఉండగా.. తమకు ఇతర మీడియాలతో పనేమిటని.. బీఆర్ఎస్ నేతలు ఫిక్స్ అయిపోయారు.
వెలుగు , ఆంధ్రజ్యోతి పత్రికల్ని పార్టీ పరంగా చాలా రోజులక్రితం నిషేధించారు. వారిని తమ ఆఫీసుల్లోకి రానివ్వడంలేదు. వారి ఆఫీసులకు చర్చలకు వెళ్లడం లేదు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడు అధికారిక కార్యక్రమాలకూ ఆ మీడియాను రానివ్వడం లేదు. అధికారిక కార్యక్రమానికి మీడియాను రానివ్వకుండా చేయడమనేది.. ప్రజాస్వామ్య వ్యతిరేకం. మీడియాకు ఉన్న హక్కుల్ని హరించడమే. అయితే పాలకులు ఇప్పుడు తెలివి మీరిపోయారు. తమ సొంత అధికారం అన్నట్లుగా చెలరేగిపోయే పరిస్థితి వచ్చింది.
ప్రశ్నించకుండా తమను నియంత్రిస్తే… తమ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా ఉంటాయని అనుకుంటుందేమో కానీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అనుకూల మీడియా … విపక్షాలపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా బాగానే ఉంటుది.. తమపై నిజాలు చెబితే తప్పన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రేపు అధికారం మారితే.. .. మీడియా ప్రమాణాలను .. అధికారంలోకి వచ్చే వారు మరింత దిగజార్చుతారు. కానీ పెంచరు. కానీ పాలకులు వచ్చే నష్టాన్ని గుర్తించకుండా.. తాత్కలిక ప్రయోజనాల కోసం మీడియాతో ఆటలాడుతున్నారు.