తెలంగాణ ప్రభుత్వం జోరు మీద ఉంది. ప్రజలకు అతిపెద్ద సమస్యగా ఉన్న లే ఔట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెవిన్యూ మంత్రి పొంగులేటి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనుమతి లేని.. నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల, వెంచర్ల రెగ్యులరేషన్ కోసం ఈ స్కీమ్ ను కేసీఆర్ సర్కార్ లోనే ప్రవేశ పెట్టారు. అప్పట్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో… ప్రజల నుంచి డబ్బులు పిండుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆగిపోయింది.
ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ సర్కార్ వినియోగించుకుంటోంది. కనీసం పది వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చే అకాశం ఉండటంతో వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వ భూముల్నికాపాడాలని వాటిని రెగ్యులరైజ్ కాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పూర్తయితే..తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత ఊపు వచ్చే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఆ ప్లాట్లకు ఉన్న న్యాయపరమైన సమస్యలు ఎల్ఆర్ఎస్తో తీరిపోతాయి.
ఎల్ఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ కూడా చేపట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెడితే.. అంతకు మించి నిధులు సమీకరించుకోవచ్చు. ఎందుకంటే.. ప్లాన్ ప్రకారం కట్టే ఇళ్లు తక్కువ. రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదారు అంతస్తులు నిర్మించేవారు ఎక్కువ. అందుకే ఎల్ఆర్ఎస్ అయిపోయాక.. బీఆర్ఎస్ గురించి కూడా తెలంగాణ సర్కార్ కొత్త ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.