ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరింత రెట్టింపు చేసేలా వ్యవహరించింది బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడాలని స్పీకర్ విజ్ఞప్తిని కాదని.. మరో అంశంపై చర్చకు పట్టుబట్టడం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
వర్గీకరణపై చర్చ జరుగుతుండగానే సభను బీఆర్ఎస్ వాకౌట్ చేసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగడంతో గులాబీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోనుంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా మాల-మాదిగ ఉప కులాల వర్గీకరణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి..వెంటనే ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై మాట్లాడాలని రేవంత్ తో సహా స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా అసెంబ్లీలో బీఆర్ఎస్ ముగిసిన అంశాన్ని ముందుంచి రచ్చకు దిగింది.
Also Read : చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ – మందకృష్ణ
మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్నారో లేదో చెప్పకుండా ఈ కప్పదాటు చర్యలు ఏంటని నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ వ్యవహారశైలి ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో చర్చనీయాంశం అవుతోంది. ఎలాగూ ఈ విషయంలో సుప్రీం తీర్పు ఇచ్చాక బీఆర్ఎస్ స్వాగతిస్తే మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని…అందుకే ఎస్సీ వర్గీకరణపై మౌనంగా ఉండటమే మంచిది అనే వ్యూహం మేరకే ఈ అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వాకౌట్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.