భారత రాష్ట్ర సమితి తన తదుపరి రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో బీజేపీపైనే భీకర యుద్ధం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌పై భీకర యుద్ధం.. బీజేపీతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేయాలని డిసైడయ్యారు. అందుకే తన పార్టీ సిద్ధాంతాలను కూడా హిందూత్వం వైపు మళ్లించారు.
బీజేపీపై యద్ధం ప్రకటించినా.. మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించినా కేసీఆర్ రాజకీయ వ్యూహం మత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో స్నేహంగా ఉండటం కీలకమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా పరిస్థితులు మార్చారని అంటున్నారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా బీఆర్ఎస్ మళ్లీ బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఈ సంకేతాలను పంపడంలో చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు.
కవిత ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా.. మొత్తం కాంగ్రెస్ కూటమిని కవిత తప్పు పడుతున్నారు. కవిత తీరు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంటులో పొగబాంబు ఘటన, ఆ సందర్భంగా 146 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించటం తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వస్తే కవిత ఇబ్బంది పడతారు. కాపాడుకోవడానికి అధికారం కూడా లేదు. మరో వైపు కాంగ్రెస్ విచారణలతో దాడి చేయడానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పరోక్షంగా అయినా రాజీ చేసుకుని ముందకెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ హిందూత్వ వాదం వినిపిస్తున్నారని అంటున్నారు.