కాంగ్రెస్ సర్కార్ పై క్రమంగా దూకుడు పెంచుతోన్న బీఆర్ఎస్… ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం అని బలంగా నమ్ముతోంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడిన బీఆర్ఎస్… అనర్హత వేటుతో వచ్చే ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.
అయితే, ఉప ఎన్నికలకు ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. పైగా, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట… ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ ను ప్లాన్ చేసింది. శేరిలింగంపల్లి నుండి పార్టీ మారిన అరికెపూడి గాంధీ నుండే మీటింగ్స్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టార్ట్ చేశారు.
నిజానికి ఇక పార్టీ మారబోయే నేతలున్నా… వారంతా గ్రేటర్ నుండే అన్న అనుమానం బీఆర్ఎస్ లోనూ ఉంది. దీంతో కిందిస్థాయి నుండి ఒత్తిడి పెంచితే, వలసలు ఆపొచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతోంది. దీనికి తోడు కిందిస్థాయి క్యాడర్ వెళ్లకుండా ఉండేందుకు ఏడాదికి పైగా సమయం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అంశాన్ని ఇప్పటి నుండే వాడుకోవటం స్టార్ట్ చేసింది.
నాయకులు వెళ్లొచ్చు… వారి స్థానంలో కొత్త వారిని తయారు చేస్తాం. ఇక రాబోయేది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే. అందులో సత్తా చాటడం తమ ముందున్న ప్రధాన లక్ష్యం. కొత్త కార్పోరేటర్లను తయారు చేసే బాధ్యత, గెలిపించుకునే బాధ్యత పార్టీదే. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దూ అంటూ కేటీఆర్ స్థానిక నాయకుల్లో భరోసా నింపే పని మొదలుపెట్టారు.
నిజానికి గ్రామీణ నేపథ్యం ఉన్న చోట కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కానీ, అక్కడ ఫోకస్ పెద్దగా చేయటం లేదు. కానీ, గ్రేటర్ లో ఫోకస్ చేయటం అంటే… వలసలు ఆపటంతో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీని రెడీ చేయటమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.