ఢిల్లీ లిక్కర్‌స్కామ్, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఎవ్వరూ మాట్లాడొద్దని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను బి ఆర్ ఎస్ హై కమాండ్ స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ నుంచి పార్టీ నేతలకు ఈ మేరకు సందేశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులు.. విచారణ.. ఈడీ, కేంద్రంపై కామెంట్లుచేయవద్దని ఆదేశించారు. టీవీ చర్చల్లోనూ ఈ అంశంపై మాట్లాడవద్దని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హఠాత్తుగా సీన్ మార్చేశారు. మధ్యాహ్నం నుంచి అసలు ఈడీ విచారణలో కవిత ఉందన్న సంగతిని మర్చిపోయారు. బండి సంజయ్.. మూడు రోజుల కిందట కవితను పలానా మాట అన్నారంటూ ఆందోళనలు ప్రారంభించారు.
కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ మూడు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలే అసలు సమస్య అన్నట్లుగా ఆందోళనలు ప్రారంభించారు. ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు ప్రారంభించారు. మీడియాలోనూ అదే హైలెట్ అయింది. లిక్కర్ స్కాం అనేది సమస్య కాదని బండి సంజయ్ అన్న మాటలే అసలు సమస్య అన్నట్లుగా పరిస్థితిని మార్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఢిల్లీలోనూ అదే జరిగింది. ఢిల్లీలోనూ ఆందోళనలు బండి సంజయ్ వ్యాఖ్యలపైనే జరిగాయి.
లిక్కర్ స్కాం విచారణ విషయంలో తెర వెనుక ఏమైనా రాజీ ప్రయత్నాలు ప్రగతి భవన్ నుంచి జరిగాయా అన్న చర్చలు జోరుగా బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. దీనికి కారణం హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.. న్యాయనిపుణులతో సంప్రదింపులు అని చెబుతున్నారు కానీ కవితను అరెస్ట్ చేయకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారని అంటున్నారు. కారణం ఏదైనా కవితును అరెస్ట్ చేయలేదు. కానీ ముప్పు తప్పలేదని.. పదహారో తేదీన మళ్లీ హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల ద్వారా స్పష్టమవుతోందని అంటున్నారు. మరి ఈ నాలుగు రోజుల్లో ఏమైనా పరిణామాలు మారుతాయేమో చూడాల్సి ఉంది.