ప్రభుత్వం ఏం చేస్తున్నా దానిపై నిర్మాణాత్మక వ్యతిరేక ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ గట్టిగానే ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా కులగణన అంశంలో ఇది బయట పడింది. ఎన్యుమరేట్లు ఎవరైనా ఇంటికి వెళ్తే వారిని అత్యాధునిక కెమెరాలతో చిత్రీకరిస్తూ .. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా.. ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని అనిపించేలా ప్రశ్నలు వేస్తూ.. ఆ వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి పంపుతున్నారు. వారేమో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చూశారా అంటూ తిప్పేస్తున్నారు.
కులగణన విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా రూల్స్ చెప్పింది. ఎవరికి చెప్పడం ఇష్టం లేకపోయినా దానికో కాలమ్ ను నిర్దేశించింది. ఎన్యూమరేటర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కొంత మంది ఎన్యూమరేటర్లు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియాకు పంపుతున్నారు. వారికి ఆ పని చేయడం ఇష్టం లేకపోతే తమ పై అధికారులకు చెప్పి వైదొలగాలి కానీ ఇలా చేయడం వారి కెరీర్‌కే ఇబ్బంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. కులగణన ను వ్యతిరేకిస్తే రాజకీయంగా ఇబ్బందికరమని ఇలా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నట్లుగా వీడియోలు క్రియేట్ చేసి.. ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ సకలజనుల సర్వే నిర్వహించారు. అప్పుడు ఇంట్లో ఉన్న కోళ్లు, కుక్కల దగ్గర నుంచి ఆస్తుల వరకూ మొత్తం సేకరించారు. ఆ డీటైల్స్ తో ఏం చేశారో ఎవరికీ తెలియదు. అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా చాలా మంది భయం భయంగా తమ వివరాలు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే కులగణనలో ఉన్న ప్రశ్నల విషయంలో మాత్రం అనేక రకాల వ్యతిరేక ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిపై క్లారిటీ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయింది. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు అవకాశంగా మారిందని అనుకోవచ్చు.