ఎక్కడ ఏం జరిగినా అదో పెద్ద తప్పిదమని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేయడానికి విచిత్రమైన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నానక్ రామ్ గూడ సైక్లింగ్ ట్రాక్ విషయంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఓ ముఫ్పై మీటర్ల సైక్లింగ్ ట్రాక్ తొలగించారు. అయితే మొత్తం 23 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ తీసేస్తున్నారని ప్రచారం ప్రారభించేశారు. కాసేపటి తర్వాత అందరికీ అసలు విషయం తెలిసింది. అదే సమయంలో అసలు ఆ ట్రాక్ ఎంత నిరుపయోగమో..దాని వల్ల ఎంత డబ్బు వృధానో చర్చ కూడా మొదదలయింది.
సైక్లింగ్ ట్రాక్ సోలార్ ప్లేట్స్ తో ఇరవై మూడు కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ సైక్లింగ్ చేసే వాళ్లే లేరు. కనీసం వాకింగ్ ట్రాక్ గా కూడా ఉపయోగపడటం లేదు. కానీ ఈ సైక్లింగ్ ట్రాక్ వల్ల యూటర్నులు కూడా లేకపోవడం వల్ల నానక్ రామ్ గూడతో పాటు కోకాపేట సహా ఆ చుట్టుపక్కల ఉండే కాలనీల వాసులందరికీ చాలా సమస్యలు వస్తున్నాయి. ఎంతో దూరం వెళ్లి యూటర్న్ తీసుకుని రావాల్సి వస్తోంది. అటు వైపు వెళ్లని వాళ్లు ఐ సైక్లింగ్ ట్రాక్ గురించి గొప్పగా చెబుతున్నారు కానీ.. అక్కడ ఉండి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం అసలు దాని వల్ల ఉపయోగమేమిటి అని ప్రశ్నలు వేస్తున్నారు.
భారీ అసౌకర్యానికి కారణం అవుతున్న ఆ సైక్లింగ్ ట్రాక్ సంగతి తేల్చాలని కోరుతున్నారు. ఇప్పటి వరకూ చాలా మందికి ఈ సమస్యపై మాట్లాడాలని ఉన్నా ఎవరూ మాట్లాడలేకపోయారు. అదో గొప్ప ఇనిషియేటివ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే దీనికి కారణం. ఈ ట్రాక్ నిర్మాణానికి చాలా ఖర్చు పెట్టారు. కానీ దానికి తగ్గట్లుగా ప్రయోజనమే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడి నివసించేవారి ఫీడ్ బ్యాక్ తీసుకుని వారి సమస్యల పరిష్కారనికి ఏదో చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి చేయకపోతే ఈ సైక్లింగ్ ట్రాక్ పై ఉన్న వ్యతిరేకత వెలుగులోకి వచ్చేది కాదేమో ?