కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా రేవంత్ రెడ్డికి చేయనంత ప్రచారం బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తుంది. మొదటి పోస్టు.. చివరి పోస్టు.. మధ్యలో వచ్చే అన్ని పోస్టుల్లో 70 శాతం రేవంత్ రెడ్డిపైనే ఉంటాయి. అన్నీ ఆయనను తిడుతూనే పెట్టవచ్చు కానీ.. బీఆర్ఎస్ పార్టీ పొగుడుతుందని ఎవరూ అనుకోరు. పోనీ అలా పెట్టేవి ఏమైనా సీరియస్ విషయాలా అంటే అవీ కాదు. ఫేక్ న్యూస్. జనాలు నమ్ముతారా లేదా అన్న ఆలోచనలు అసలు చేయకుండా రేవంత్ పై ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ మాట్లాడితే.. అదేదో తప్పు అన్నట్లుగా రాసి ఆయన మాటల్ని ప్రచారం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి నోరు జారరు. ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు స్పష్టత ఉంటుంది. తాను మాట్లాడే మాటలకు ప్రచారం రావాలని కోరుకుంటారు. పార్టీ కార్యకర్తలను హెచ్చరించినా.. బుజ్జగించినా తన సందేశం వారికి బలంగా చేరాలని అనుకుంటారు. ఆ పనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసి పెడుతోంది. విచిత్రం ఏమిటంటే కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పేరు ఎవరికీ గుర్తుండటం లేదని.. ప్రచారం చేస్తోంది. తాను గుర్తు చేస్తానన్నట్లుగా ఉంది తీరు. మీనాక్షి నటరాజన్ జై రేవంత్ రెడ్డి అనకుండా జై జగన్ అన్నారంటూ.. ఓ ట్విస్టెడ్ వీడియోను సర్క్యూలేట్ చేశారు. కాంగ్రెస్ ఇంచార్జి ఎవరైనా జై రాహుల్ అంటారు కానీ.. సీఎంలకైనా జై కొడతారా? . ఇంత చిన్న విషయాన్ని కూడా అంచనా వేయలేక ఫేక్ పోస్టులు ప్రచారం చేసి మానసిక తృప్తి పొందుతున్నారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతున్న బీఆర్ఎస్ తాము ఎందుకు రేవంత్ కు ప్రచారం చేయాల్సి వస్తుందో ఆలోచించుకోలేకపోవడం అసలు విషయం. రేవంత్ ను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వంలోని మంత్రులపైనా అదే రకంగా వ్యవహరిస్తుంది. భోజనం చేయడం కూడా తప్పనట్లుగా ఓ ఫోటో పెట్టి మీరు మనుషులేనా అని తిట్టేస్తున్నారు. ఈ తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉపయోగం కలుగుతోంది. తమ పార్టీ చేయలేని పని బీఆర్ఎస్ చేస్తున్నందుకు రేవంత్ కూడా సంతోషం కలిగిస్తుందేమో కానీ… వారిని తమ దారిలో మరింత ఎక్కువగా వెళ్లేలా స్టఫ్ ఇస్తున్నారు కానీ పెద్దగా పట్టించుకోవడంలేదు.