ఏం చేద్దామంటావు మరి ? అనే మీమ్ కేసీఆర్ ఫోటోతో వైరల్ అవుతూ ఉంటుంది. ఓ జర్నలిస్టును ఉద్దేశించి సీఎంగా కేసీఆర్ అన్న మాట అది. అది వైరల్ మీమ్. చాలా సందర్భాలకు మ్యాచ్ అవుతుంది. ఇదేదో బాగుందనుకున్న పూరి జగన్నాథ్ తన డబుల్ ఇస్మార్ట్ పాటలో దాన్ని వాడేసుకున్నారు. ఆ పాటలో ఆయన ఎక్కడ కేసీఆర్ బొమ్మ వాడలేదు. కేవలం పదం వాడారు ?
అదేమీ కేసీఆర్ సృష్టి కాదు…కానీ అదేదో కేసీఆర్ ను అవమానించినట్లుగా ఫీలైపోయి కొంత మంది తెరపైకి వచ్చేస్తున్నారు. కేసీఆర్ అన్న మాట్లని హుక్ లైన్ గా వాడటం ఏమిటని.. ఇది తమ బాపును అవమానించడమేనని సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఆసక్తి ఉన్న వాళ్లు ఖండించడం ప్రారంభించారు. హైప్ కోసం ఇలాంటి వివాదాలు కోరుకునే సినిమా వాళ్లకు ఇది హాయిగానే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలే చులకన అయిపోతారు.
ఏం జేద్దామంటావు మరి అనే దాంట్లో ఎలాంటి తప్పిదం లేదు.. అక్కడ కేసీఆర్ ప్రస్తావన లేదు. బీఆర్ఎస్ ప్రస్తావన అసలే లేదు. దీన్ని కూడా వివాదం చేసుకుని … తమ వారిని అవమానించేశారని తీర్మానం చేసుకుంటే.. రేపు నిజంగా అవమానించినా పట్టించుకోనే వారు ఉండరు. ఇప్పుడు సినిమా వాళ్లకు బీఆర్ఎస్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేంత తీరిక ఉండదు… బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఉన్నట్లుందని సెటైర్లు అందుకే వినిపిస్తున్నాయి.