రాజకీయాల్లో నిజం నిర్భయంగా నమ్మాలి. నిజాన్ని నమ్మకుండా తమ చేతిలో మీడియా, సోషల్ మీడియా ఉందని కళ్ల ముందు జరిగే వాటిని కూడా తమకు అనుకూలంగా ఉండే వాటిని రాసుకుంటూ.. తమ ప్రత్యర్థులకు ఏదో జరిగిపోతుందని ఊహించుకుంటూ కాలం గడిపేస్తే అది ఆత్మవంచన అవుతుంది. ఇలాంటి ఆత్మవంచనకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు అదే దారిలోకి బీఆర్ఎస్ వెళ్తోంది.
వైసీపీ తరహాలో బీఆర్ఎస్కు మీడియా, సోషల్ మీడియా బలం
వైసీపీకి ఉన్నట్లుగానే సాక్షి మీడియాకు కూడా మీడియా,సోషల్ మీడియా బలం దండిగా ఉంది. సొంత మీడియాతో పాటు అనుబంధంగా ఉన్న చానళ్లు కూడా బాకా ఊదుతూంటాయి. అంతేనా సోషల్ మీడియాను కూడా ఖర్చుకు వెనుకాడకుండా బలంగా నిర్వహిస్తూంటారు. అయితే ఇదంతా తమ అధినేతల మనసును మెప్పించడానికే అన్నట్లుగా సాగుతూంటాయి. రియాలిటీకి దూరంగా ఉంటాయి. తమ బాసులను పొగడటం.. స్వకుచమర్దనం చేసుకోవడం.. ప్రత్యర్థుల్ని తిట్టడం.. వారి పని అయిపోయిందని చెప్పుకోవడం తప్ప మరో ఎజెండా లేనట్లుగా మారిపోతుంది.
పూర్తి హెలూసినేషన్లో బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా!
బీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు… రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ లేకపోతే కాంగ్రెస్ ను ఎలా వాడుకోవాలో..ఎలా ఆడుకోవాలో బీఆర్ఎస్కు బాగా తెలుసు. అందుకే రేవంత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కొంత కాలం నుంచి సింగిల్ పాయింట్ అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ గానే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అది ఇప్పుడు ఓవర్ ది బోర్డు వెళ్లిపోయింది. రేవంత్ కు హైకమాండ్ వద్ద పలుకుబడిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. అంతే కాదు.. భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రేవంత్ సీఎంగా ఉంటే వారికి ఎంత ఉక్కపోతగా ఉందో కదా అని న్యూట్రల్స్ కూడా నవ్వుకునే పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీ లాగే తనను తాను మోసం చేసుకుంటున్న బీఆర్ఎస్
BRS
వైసీపీ కూడా ఇలాంటి హెలూసినేషన్లో సొంత ప్రచారాలే నిజం అని నమ్ముకుని తనను తాను మోసం చేసుకుని పాతాళానికి పడిపోయింది. బీఆర్ఎస్ కూడా అంతే. ఓడిపోయిన తర్వాత అయినా రియాలిటీని అర్థం చేసుకోలేకపోవడం బీఆర్ఎస్ దుస్థితికి కారణంగా మారింది. ప్రజల్ని నమ్మించడానికి అలాంటి ప్రచారాలు చేస్తున్నామని వారనుకుంటున్నారు కానీ.. తమను తాము మోసం చేసుకుంటున్నామని మాత్రం గుర్తించలేకపోతున్నారు.