భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్న కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వంపై పేక్ ప్రచారాలు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వందల కొద్దీ ఫేక్ అకౌంట్లు, యూట్యూబ్ చానల్స్ సాయంతో ఓ ఉద్యమంలా తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారన్న అనుమానంతో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా విచారణ కోసం నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన వచ్చిన తర్వాత విచారణ జరిపి అరెస్టు చేశారు.
కొణతం దిలీప్ ను గతంలోనూ రెండు సార్లు అరెస్టు చేశారు కానీ జైలుకు పంపించకుండానే బెయిల్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఆయన డిజిటల్ మీడియా డైరక్టర్ గా వ్యవహిరంచారు . పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జుగా వ్యవహరిస్తున్నారు. యూట్యూబ్ చానళ్లు లేకపోవడం వల్లనే ఓడిపోయామని కేటీఆర్ గట్టి అభిప్రాయంతో ఉన్నారు. దానికి తగ్గట్లుగా పెద్ద ఎత్తున యూట్యూబ్ చానళ్లను కొణతం దిలీప్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాను నడుపుతున్నారని అనుమానంతో పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నిర్దిష్టంగా ఎలాంటి నేరాభియోగాలు మోపారన్నది తెలియాల్సి ఉంది. డిజిటల్ డైరక్టర్ గా ఉన్నప్పుడు ప్రముఖులతో రీల్స్ కోసం పదిహేను కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.