నిరుద్యోగుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన స్క్రిప్టెడ్ ధర్నా అభాసుపాలయింది. నిజంగా నిరుద్యోగులు అయితే ఆందోళన రేంజ్ వేరుగా ఉండేది. అంతా పొలిటికల్ కావడంతో.. బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు.. .సోషల్ మీడియా సైనికులు తరలి వచ్చారు. కావాల్సినంత డ్రామా చేసే ప్రయత్నం చేశారు. యూట్యూబ్ లో బాగా వెనుకబడిపోయామని పదే పదే చెప్పుకున్న కేటీఆర్ కరెక్ట్ చేసుకున్నారేమో కానీ ఓ పది యూట్యూబ్ చానళ్ల లోగోలతో.. కొంత మంది హంగామా చేశారు. వారితోనే తిప్పి తిప్పి ఇవే ఆందోళనలు అన్నట్లుగా హైలెట్ చేశారు. పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేస్తే. .. వారిని ఉంచిన చోటుకు వెళ్లి కాస్త హడావుడి చేశారు.
అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు చేసే ఆందోళనలకు ఎంత కవరేజీ వచ్చేదో.. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన ఆందోళనకూ అంతే కవరేజీ వచ్చింది. ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా చానల్ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏమయిందని నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ ఇంత డ్రామా చేసిందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆరు నెలలు కూడా కాలేదు.. అందులో మూడు నెలలకుపైగా ఎన్నికల కోడ్. అప్పుడే ఏమీ చేయలేదని ఎగబడటం అంటే.. నమ్మశక్యంగా లేదని.. ఏదో గూడుపుఠాణి ఉందన్న అభిప్రాయం వినిపించింది.
చంద్రబాబు రోడ్ షో కేంద్రంగానే ఈ నిరుద్యోగ ఆందోళనలు జరిగినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో టీడీపీని విస్తరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. బీఆర్ఎస్ గమనించి.. ఆయనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ యూత్ ను హైదరాబాద్ కు తరలించిందని అనుమానిస్తున్నారు. ఉదయం నుంచే .. బీఆర్ఎస్ సోషల్ మీడియా నిరుద్యోగులతో పాటు.. చంద్రబాబు రోడ్ షోపైనా విమర్శలు చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టడమే తప్పని.. తెలంగాణ ఎవరి పాలయిందో అంటూ రెచ్చగొడుతూ వచ్చారు. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. అదంతా స్క్రిప్టెడ్ డ్రామాలాగే మిగిలిపోయిందన్న సెటైర్లు మాత్రం వినిపిస్తున్నాయి.