తెలంగాణ తల్లి చేతుల్లో బోనం లేదని.. బతుకమ్మ లేదని తెలంగాణ అస్థిత్వం లేదని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తించారా అన్న విషయం మాత్రం చెప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల వరకూ బీఆర్ఎస్ పరిపాలించినా తెలంగాణ తల్లి విగ్రహం అనే మాటే పాలనలో వినిపించలేదు. తెలుగుతల్లి విగ్రహాన్ని .. కొత్త సెక్రటేరియట్ కోసం పెకిలించి ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు. అలాగని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయినా పెట్టారా అంటే అదీ కూడా లేదు. అసలు తెలంగాణతల్లి రూపాన్ని అధికారికంగా ఎప్పుడూ బీఆర్ఎస్ గుర్తించలేదు.
ఉద్యమాన్ని పెంచాలనుకున్నప్పుడు తెలుగు తల్లి అనే భావన అందర్నీ కలుపుతోందని.. విడగొట్టకపోతే ప్రజల్లో మార్పు రాదని గమనించిన కేసీఆర్ తెలుగు తల్లి ఎవరికని ప్రశ్నించి తెలంగాణ తల్లిని తన మేధావులతో రూపకల్పన చేయించారు. అప్పట్లోనే విగ్రహం చేయించి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రూపాన్నే తెలంగాణ తల్లిగా నోటిఫై చేయవచ్చు. కానీ చేయలేదు. పట్టించుకోలేదు. రేవంత్ మాత్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కేసీఆర్ తయారు చేయించిన విగ్రహం కవితలా ఉందని.. తెలంగాణ దొరల పాలనకు ప్రతీకలా ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లి తాను కొత్త నమూనా సిద్దం చేయించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ సిద్దం చేయించిన విగ్రహంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే అది వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. రేవంత్ ఉన్నదానికి మార్పు చేర్పులు చేస్తే గట్టిగా ప్రశ్నించవచ్చు. అసలు లేదు కదా అని ఇతరుల నుంచి వచ్చే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సమాధానం లేదు. మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహం విషంయలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించారని అనుకోవచ్చు. దీనిపై ఎంత రాజకీయం చేస్తే బీఆర్ఎస్కు అంత మైనస్ అవుతుంది.