తెలంగాణ రాజకీయాలపై క్లారిటీ వస్తోంది. బీఆర్ఎస్ తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నే ఫైనల్ చేసుకుంటోంది. బీజేపీని క్రమంగా పక్కన పెట్టేస్తోంది. గతంలో బీజేపీపై .. ధాన్యం కొనుగోలు అని… మోదీ తెలంగాణను అవమానించారని ధర్నాలు చేసేవారు. అప్పట్లో కాంగ్రెస్ గురించి అసలు పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ నే బీఆర్ఎస్ పట్టించుకుంటోంది. పైగా ధర్నాలు కూడా చేస్తోంది. ఓ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ధర్నాలు చేయడమా… అనే ఆశ్చర్యం ప్రజల్లో వచ్చినా సరే అధికార పార్టీ నేతలకు రాలేదు.
కాంగ్రెస్ వస్తే మూడుగంటలు కరెంటే ఇస్తారా… ఎనిమిది గంటలు ఇస్తారా అన్నది తర్వాత సంగతి కానీ.. కాంగ్రెస్ తోనే హోరాహోరీ పోరాడుతున్నామన్న భావనను బీఆర్ఎస్ మరోసారి తెచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఖుషీ అయిపోయారు. బీఆర్ఎస్ పై మరింత ఎదురుదాడి చేసి… పోరాటం ఓ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళో రేపో వచ్చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత మరింత రచ్చ చేస్తారు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యల మీదే దుమారం రేపారు.
అంటే ముందు ముందు మరికొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. పైగా ఇటీవలి కాలంలో బీజేపీ చేస్తున్నపోరాటాలేం లేకపోగా… కొత్తగా టీఆర్ఎస్ ట్రాప్ లోనూ పడిపోయింది. రేవంత్ అన్న మాటల్ని బీజేపీ కూడా ప్రచారం చేస్తోంది. బండి సంజయ్ కు కేసీఆర్ పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షల్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీంతో బీజేపీ ఫ్యాన్స్… ఉష్.. అని నిట్టూర్పు విడవాల్సి వస్తోంది.