ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం మావోయిస్టు నేపధ్యం ఉన్న నేత బడే నాగజ్యోతికి టిక్కెట్ ఇచ్చారు. పేరుకు ఆమెను నిలబెట్టినా… మొత్తం ములుగులో వ్యవహారాలన్నీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచే నడుస్తున్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఇంచార్జుల్ని నియమించి వారికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఏది కావాలంటే అది అందిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు పంపుతున్నారు.
ములుగు పూర్తిగా అడవిబిడ్డలు ఉన్న నియోజకవర్గం . అంతా గిరిజనులే ఉంటారు. వారిని ఎలా ఆకట్టుకోవాలా అలా ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే సన్నిహితుడికి కేసీఆర్ బాధ్యతలు ఇచ్చారు. ఆయనతో పాట ుమరికొంత మంది రంగంలోకి దిగి చేయాల్సిదంతా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. సీతక్క గిరిజన వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో ఆమె మరుమూల పల్లెలకు వెళ్లి సాయం చేశారు. ఒక్క ములుగుకే పరిమితం కాలేదు. ఆమె మొత్తం గిరిజన ప్రాంతాలను చట్టేశారు.
మొత్తం గిరిజనులకు ఆమె దగ్గరవడంతో పాటు… కాంగ్రెస్ రాజకీయాలు ఏ మలుపులు అయినా తిరిగి ఆమె సీఎం కావొచ్చన్న ప్రచారం కూడా జడరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ మరింత ఎక్కువగా దృష్టి పెట్టింది. బిఆర్ఎస్ తనను ఓడించేందుకు దేనికైనా సిద్ధం కావడంతో సీతక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ కోరుకుంటోంది కూడా ఇదే. సీతక్క తాను బీఆర్ఎస్ లా డబ్బులు పంచలేనని కానీ.. డబ్బులు పంచేవారు తరవాత అండగా ఉంటారో లేదో చూసుకోవాలని ఓటర్లకు సలహా ఇస్తున్నారు. అయితే సీతక్కపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని డబ్బులతో కొనలేరన్న వాదన వినిపిస్తోంది.