తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత రాజకీయాలు గుసగుసలకు కారణం వుతున్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఆయనకు టిక్కెట్ ప్రకటించారు. దీంతో మరింతగా మైనంపల్లి చెలరేగిపోయారు. అయితే.. పార్టీలో ఒక్కరూ మైనంపల్లి పై మాట్లాడలేదు. అమెరికాలో ఉండి కేటీఆర్ చాలా తీరిగ్గా స్పందించారు. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీకి చాలా కాలంగా పిల్లర్ లా ఉన్నారని హరీష్ రావు గురించి చెప్పుకొచ్చారు. తర్వాత కవిత కూడా స్పందించారు. కానీ మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మూడు రోజుల తర్వాత మైనంపల్లిపై చర్యలు ఖాయమని… ఏ క్షణమైనా సస్పెండ్ చేస్తారని.. కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం లీక్ చేశారు. అంత చర్యలు తీసుకునేంత ఆలోచన ఉంటే.. ఇప్పటి వరకూ ఆగేవారు కాదన్న వాదన వినిపిస్తోంది. హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఉదయమే ఆయన వ్యాఖ్యలు చేసినా మధ్యాహ్నం ప్రకటించిన జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.
గతంలో గెలిచిన తర్వాతనే హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత పదవి ఇచ్చినా.. సిద్దిపేటకే పరిమితమయ్యారు. ఈటలరాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాతనే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడే ఈటల కూడా చెప్పారు. తన గతే .. హరీష్ కు పడుతుందని హెచ్చరించారు. ఇప్పుడు మైనంపల్లి అసలు సిద్దిపేట గురించి మాట్లాడటం.. ఆయనను ఓడిస్తామని సవాల్ చేయడం వెనుక .. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.