భారత రాష్ట్ర సమితి బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన చేస్తోంది. అసెంబ్లీలో స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ సెషన్ వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగదీష్ రెడ్డి తప్పు చేస్తే వీడియోలు బయట పెట్టాలని ..నిజమైతే విచారం వ్యక్తం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. వాయిదా తర్వాత సభలో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సభ్యులు కోరడంతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే జగదీష్ రెడ్డి స్పీకర్ ను కించపర్చలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత వారు గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఓ దశలో జగదీష్ రెడ్డిపై అనర్హతా వేటు వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. జగదీష్ రెడ్డి విషయాన్ని తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకున్న అధికార పక్షం.. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా అసెంబ్లీలో వారు వ్యవహరించిన విధానం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని అనుకున్నారు.
గతంలో శాసనమండలి చైర్మన్ పై గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్ ఫోన్లు విసిరేశారన్న కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ అభ్యర్థిత్వాలను రద్దు చేశారు. అలాంటి చర్య తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే మరోసారి అలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చని.. ఈ సారికి సస్పెన్షన్ కు ప్రతిపాదిద్దామని అందరూ అభిప్రాయానికి వచ్చారు. అయితే అది అన్యాయమని బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.