తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ముఖ్యపనిలోనూ తనదైన ముద్ర వేసిన నేత కల్వకుంట్ల తారక రామారావు, ఆయన 47వ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు ఆయన కనుసన్నల్లోనే జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలు, ఆశావహులంతా కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండలా చూసుకుంటున్నారు.
కేసీఆర్ కుమారునిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కేటీఆర్ తొలి ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి అతి తక్కువ మెజార్టీతో రెబల్ గా పోటీ చేసిన సొంత పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డిపై గెలిచారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో తిరుగులేని మెజార్టీ సాధిస్తున్నారు. ఇప్పుడు సిరిసిల్లలో ఆయన మెజార్టీ లక్ష దరిదాపుల్లోకి వచ్చింది. అలాగే తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కీలక శాఖలకు మంత్రిగా చేస్తున్నారు. ప్రతి అభివృద్ధి పనుల వెనుక.. ఆయన ముద్ర ఉంది .
తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కేటీఆర్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఆయన పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. టైర్ టు నగరాలకు ఐటీరంగాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లే కనిపిస్తున్నాయి. ఇదంతా కేటీఆర్ ఘనతే . చాలా కాలంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కన్నా కేటీఆరే యాక్టివ్ గా ఉంటున్నారు.
గత కొంత కాలంగా ఆయన కాబోయే సీఎం అనే ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆరే సీఎం కావొచ్చని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.