లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కనీసం ఖాతా ఓపెన్ చేయాలన్న లక్ష్యం పెట్టుకుంది. అలా అయితే ఉనికి నిలబడుతుంది. ఆ ఫలితాలు ఎలా ఉన్నా.. వెంటనే మరో సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ కావాల్సిందే. అవే స్థానిక ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే.. స్థానిక ఎన్నికలు పూర్తి చేసి.. పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే..అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయని చెప్పాల్సిన పని లేదు. ఎలా గెలవాలో గతంలో కేసీఆర్ చూపించారు. రేవంత్ అంతకు రెండింతలు చేస్తారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ సానుభూతిపరుల్ని కూడా కాపాడుకోవడం బీఆర్ఎస్ కు పెను సవాల్ గా మారనుంది. మాములుగా అయితే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ కాబట్టి … ఆ పార్టీలో ఉండలేని వాళ్లు బీఆర్ఎస్ లో ఉంటారనుకుంటారు.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంది. కాంగ్రెస్ తో పడని వాళ్లు బీజేపీ నుంచి పోటీ చేస్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై.. స్థానిక ఎన్నికల్లోనూ ఉనికి కోల్పోతే.. బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. బీఆర్ఎస్ ను ఎంత బలహీనం చేస్తే.. అంతగా పాలనపై దృష్టి పెట్టగలనని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే జూన్ లో .. మరో సవాల్ కు బీఆర్ఎస్ రెడీ కావాల్సిందే.