జాతీయ రాజకీయాలను కేసీఆర్ ప్రారంభించారు కానీ ఇంకా తనదైన శైలిలో బీఆర్ఎస్ ను కిక్ స్టార్ట్ చేయలేకపోయారు. రకరకాల సమస్యలు అడ్డొస్తున్నాయి. బీఆర్ఎస్కు బోలెడంత ధన బలం ఉందన్న నమ్మకం కలిగిస్తున్నా… ఇతర రాష్ట్రాల్లోని నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కూడా ఆయా రాష్ట్రాల్లోని నేతలను తెలంగాణకు పిలిపించుకుంటున్నారు కానీ.. ఆయా రాష్ట్రాలకు వెళ్లడం లేదు. దీంతో జాతీయ రాజకీయం అయినా .. మొత్తం తెలంగాణలో జరుగుతోంది. అయితే దేశం మొత్తం ఆకర్షించేలా బహిరంగసభ నిర్వహించి ఆ తర్వాత వరుసగా రాష్ట్రాల పర్యటనలు చేయాలని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించడం ద్వారా ఈ ప్రక్రియ ను ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 27 బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా .. అవసరం లేకపోయినా ప్లీనరీ నిర్వహించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చినందున ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారు.
బీజేపీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల బలం నిరూపించే విధంగా బీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించాలని కె.చంద్రశేఖరరావు యోచిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ప్లీనరీ సమావేశం ఇదే. పార్టీ ప్లీనరీకి బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ నాయకులు, అలాగే నగరంలో వారితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దానికి తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ తో పాటు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ లను ఆహ్వానించాలని నిర్ణయించారని చెబుతున్నారు.
ఇలాంటి సభ సెక్రటేరియట్ ఓపెనింగ్ సందర్భంగా జరగాల్సి ఉంది. కానీ అది కూడా వాయిదా పడటంతో ప్లీనరీకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.