తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణైప రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. రాజకీయంగా కాకుండా జ్యుడిషీయల్ కమిషన్ను ఏర్పాటు చేసి నిర్ణయంతీసుకోవాలనుకుంటున్నారు.
తెలంగాణలో మొత్తం పార్లమెంట్ నియోజక వర్గాలు 17 ఉన్నాయి. ఈ లెక్క చూస్తే పదిహేడు జిల్లాలు అవసరం అవుతాయి. జనాభా లెక్కల ప్రకారం చేస్తే 22 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది. ఎలా చూసినా జిల్లాల సంఖ్య ఈ రెండింటి మధ్యే ఉంటుందని 33గా ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అంటే కనీసం పది జిల్లాలు తగ్గిపోతాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లే అవుతుంది. జిల్లాల సెంటిమెంట్ తో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది.
కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్ని చోట్లా పెరిగిపోయింది. ఇప్పుడు జిల్లాలు తగ్గిస్తే ఆయా జిల్లాల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. భూముల విలువలు తగ్గిపోతాయని బీఆర్ఎస్ ఉద్యమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలను కన్విన్స్ చేయగలిగితే ఏ సమస్యా ఉండదు. రేవంత్ సర్కార్ ప్రజలకు… జిల్లాల తగ్గింపు వల్ల ప్రయోజనాల గురించి చెప్పిఅడుగు ముందుగు వేయాలి… లేకపోతే బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లే అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ లోనే వినిపిస్తోంది.