తెలంగాణలో మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక గ్రాడ్యూయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పదవి కాలం మార్చి 29న ముగుస్తుంది. ఆ లోపే ఎన్నికల ప్రక్రియను ఈీసీ పూర్తి చేయనుంది. టీచర్ ఎమ్మెల్సీల్లోనూ పోటీ చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. అభ్యర్థుల్ని ప్రకటించి.. రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు మద్దతిచ్చి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీల్లో బరిలోకి దిగాలనుకుంటోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చప్పుడు చేయడం లేదు. ఎన్నికల్లో పోటీకి దూరమని సంకేతాలు పంపుతోంది. ఇదే రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఉత్తరతెలంగాణలో నాలుగు కీలక ఉమ్మడి జిల్లాల గ్రాడ్యూయేట్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రజా నాడి ఏమిటో తెలిసిపోతుంది. ప్రభుత్వంపై ఏడాదిలోనే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందని ప్రజలు తరిమికొడుతున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని… కేటీఆర్ చెబుతున్నారు . ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా.. పారిపోతే ప్రజలు ఏమనుకుంటారు ?. పట్టభద్రుల్లో అన్ని వర్గాలు ఉంటాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో బయటపడుతుంది.దాన్ని క్యాష్ చేసుకోలేకపోతే బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే అవుతుంది.
ఇప్పటికే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చాలా వరకూ బీజేపీకి వెళ్లింది. ఆ విషయం పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమయింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీఎన్నికల్లో పోటీ చేయకపోతే పర్మినెంట్ గా ఆ పార్టీకి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును ఇచ్చేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ ఇంత అగ్రెసివ్ గా రోజూ ప్రజల్లోకి వెళ్తూ.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అన్న ప్రశ్న సగటు క్యాడర్ కు వస్తుంది. పోటీకి సిద్దంగా పలువురు నాయకులు ఉన్నప్పటికీ.. పోటీ చేయకపోవడం ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.