బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాన్ని ఆలస్యంగా కేటీఆర్ ఖండించగా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు..పొత్తు ఉండనుంది అనే తరహాలో కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకొంతమంది చేరేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలగడం అసాధ్యమని పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.
అయితే, పార్టీని వరుసగా నేతలు వీడుతోన్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్ లో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా కేటీఆర్ సంకేతాలు ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతోన్న తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. విలీనం కాదు.. పొత్తుకు సిద్దమని సంకేతాలు పంపినట్లు ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.