పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే గతంలో బీఆర్ఎస్ చేసిందేమిటి అన్న ప్రశ్న వస్తే మాత్రం.. ఖచ్చితంగా ఈ ట్రెండ్ సెట్ చేసింది బీఆర్ఎస్సే అనుకోవచ్చు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకే పీఏసీ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించామని… వారు తమ పార్టీలో చేరిపోయారని.. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదని అప్పట్లో బీఆర్ఎస్ వాదించింది. కానీ ప్రజా తీర్పును పరిహాసం చేసిందనేది విలీనంతోనే తేలిపోయింది. అందులో పీఏసీ చైర్మన్ పదవి ఒకటి. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ… సాంకేతికతంగా తమ పార్టీ సభ్యుడికే పీఏసీ కమిటీ చైర్మన్ పోస్టు ఇచ్చినా గగ్గోలు పెడుతోంది. బీఆర్ఎస్ మొదట్లో విలువలతో వ్యవహరిచి ఉంటే.. ఇప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోయింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాజకీయాల్లో విలువలు అనేవి ఉండవన్నట్లుగా .. నిర్ణయాలు తీసుకున్నారు. ఫిరాయింపులు, విలీనాలు, కోవర్ట్ ఆపరేషన్లు, ట్యాపింగులు ఇలా ఎంత అరాచకం చేయకూడదో అంతా చేశారు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ తాము చేసిన వ్యవహారాలు తమకే రివర్స్ అవుతూండటంతో వారికి నొప్పిగా ఉంటోంది. ప్రజల నుంచి వారికి సానుభూతి కూడా లభించడం లేదు.