తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. బండి సంజయ్ ను మార్చేసిన తరవాత బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. అసలు రేసులో లేకుండా పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫైట్ ముదురుతోంది. రేవంత్ రెడ్డి తానా సభల్లో అన్న ఒక్క మాటను ఇక్కడ రాజకీయం చేసి..దాని మీదనే గెలిచేద్దామన్నట్లుగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తూండటం… కాంగ్రెస్ పార్టీకి్ కూడా కలసి వస్తోంది. మరో పార్టీ రేసులో లేదని.. తామిద్దరమే పోటీ పడుతున్నామన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి చురుకుగా ఎదురుదాడి చేస్తున్నారు. తాను అనని మాటల్ని అన్నట్లుగా సృష్టించారని… చెప్పి ఆయన అసలు కరెంట్ సమస్యలు, బషీర్ బాగ్ కాల్పుల అంశాన్ని కేసీఆర్ కు కలపడమే కాదు.. అసలు రైతులకు ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. అదే సవాల్ చేసి.. సబ్ స్టేషన్ల వద్ద చర్చకు రావాలంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న సబ్ స్టేషన్ల పరిధిలో తాము ఓట్లు అడగబోమని.. ఇవ్వని చోట మీరు అడగవద్దని అంటున్నారు.
ఈ వ్యవహారం బీఆర్ఎస్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. తాము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నదంతా ఈ వివాదంతో ఉత్తదేనని తేలిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనిపై మరింత ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్ధమైంది. రేవంత్ మూడు గంటల వివాదంపై… ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ రెండు పార్టీల మధ్య పోరాటం ఇలా సాగుతోంది.. కానీ బీజేపీ వాయిసే ఎక్కడా వినిపించడం లేదు.