బీఆర్ఎస్, గవర్నర్ మధ్య రచ్చ అంతకంతకూ పెరుగుతోంది. తమిళిసై చివరికి టీవీ డిబేట్లకూ వెళ్తున్నారు. ఇది బీఆర్ఎస్ నేతల్ని మరింత అసహనానికి గురి చేస్తోంది. గవర్నర్ పై అసభ్యకరంగా విమర్శలు చేస్తున్నారు. ఓ రాజ్యంగాధిపతిపైన.. అదీ కూడా మహిళపైనా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. అదే సమయంలో వారిని మరింత ఆవేశానికి గురిచేసేలా తమిళి సై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సంయమనం కోల్పోయేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు … అధికార పార్టీలో ప్రారంభమయ్యాయి.
గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదు. బిల్లులను తొక్కి పెట్టారు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణం. ఈ అంశంపై అందరికీ స్పష్టత ఉంది. అయితే గవర్నర్ ను అంత కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయమూ ప్రజల్లో ఏర్పడుతోంది. గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతో ప్రోటోకాల్ ఇవ్వడం లేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అలా చేయకుండా ఆమెకు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన ప్రోటోకాల్ ఇచ్చి ఉంటే ఒక్క గవర్నర్ వ్యవహారశైలి మాత్రమే హైలెట్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రభుత్వం గవర్నర్ పట్ల వ్యవహరిస్తున్న విధానం కూడా చర్చనీయాంశం అవుతోంది.
కేంద్రం ఇప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ చర్చల్లోకి వస్తాయని రాజకీయవర్గాలుచెబుతున్నాయి. ఈ కారణాలన్నీ చూపి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకున్నా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరవాతైనా రాష్ట్రపతి పాలన విధిస్తే కేసీఆర్ ఇబ్బందిపడతారు. బహుశా ఆ ప్లాన్ కోసమే గవర్నర్ తో ఇలా రచ్చ చేయిస్తున్నారేమో కానీ ఇదే నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడినట్లేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.