ఓ సినిమా ధియేటర్లో కరెంట్ పోయింది. వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆ వీడియోలు వస్తాయి. రేవంత్ సీఎం కావడం వల్ల కరెంట్ లేదని ప్రచారం ప్రారంభిస్తారు. ఓ చోట ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు… అంతకు ముందు అంటే బీఆర్ఎస్ హయాంలో నీళ్లు వెల్లువలా పారేవని.. రేవంత్ సీఎం కాగానే నేలలు నెర్రలిచ్చేశాయని చెబుతూ వీడియో పెట్టేస్తారు అదే సమయంలో పచ్చని పొలాల్ని చూపించి.. ధ్యాంక్యూ తెలంగాణ మొదటి సీఎం సార్ అని పోస్టు వేరే సోషల్ మీడియా ఖాతాలో కనిపిస్తుంది. అంటే… నీళ్లు లేకపోవడం రేవంత్ తప్పిదం.. నీళ్లు ఉండటం.. కేసీఆర్ గొప్పదనం అని చెప్పడమన్నమాట.
ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రజలకు వచ్చే ప్రతి సమస్యకు .. కాంగ్రెస్ కు.. రేవంత్ కు ముడి పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ రావడం వల్లే మీకి సమస్య అంటూ.. చెప్పుకొస్తున్నారు బీఆర్ఎస్ నేతల అతి చూసి.. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వంలో ఎవరున్నారన్నదానికి సంబంధం లేకుండా జరిగిపోయే వ్యవహారాలకూ… కాంగ్రెస్ రావడం వల్లే ఇలా జరిగిందంటూ… ప్రచారం చేయడంపై సామాన్యుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాక ముందు తెలంగాణ లో అసలు పంటలే పండవన్నట్లుగా.. ప్రజలు అంతా వలస వెళ్లిపోయారన్నట్లుగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ వచ్చి హాయిగా బతుకుతూంటే.. ఇప్పుడు కాంగ్రెస్ రావడంతో మళ్లీ ఆనాటి పరిస్థితులు వచ్చాయని చెప్పాలని తెగ తాపత్రయ పడుతున్నారు. చివరికి కవిత కూడా మూడు నెలల్లోనే ముప్పై సార్లు ధర్నా చేశారు. బీసీలన్నారు.. జీవో నెంబర్ 3 అన్నారు… విద్యార్థుల ఆత్మహత్యలన్నారు.. ఇలా చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ విద్యార్థులు యాభై మంది ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న వారు లేరు.
ఈ వ్యవహారాలతో బీఆర్ఎస్ ఏం సాధిస్తుందో కానీ… అధికారం పోయిన మూడు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని .. చెప్పాలని అనుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్… మూడునెలలు కూడా ఆగకుండా.. కాంగ్రెస్ పై ఈ తరహా ప్రచారానికి తాపత్రయపడటం మాత్రం… ప్లస్ కాదు..మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.