బీఆర్ఎస్ ప్రజల్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో లేని హామీలు ఇస్తోంది. వివిధ వర్గాలతో సమావేశమై.. వారికి హామీలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్యాసింజర్ ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ అని ప్రకటించారు. ఆటో డ్రైవర్లు ఏడాదికి ఓసారి ఫిట్ నెస్ చేయించుకోవాలి. ఫిట్ నెస్ కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు మొత్తం రూ.1200 అవుతుంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. మంత్రి హరీశ్ రావు గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ గల్ఫ్ పాలసీ గురించి, గృహలక్ష్మీ పథకాలు తేనున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో గెలిస్తే గిరిజన బంధు ఇస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధులను ప్రకటించారు. ఎంత మందికి ఇచ్చారన్న సంగతి పక్కన పెడితే.. గిరిజనలకు పథకం కూడా ప్రకటించలేదు. వారిలో అసంతృప్తి ఉందని గుర్తించి వెంటనే పథకాన్ని ప్రకటించారు. ఎంత మంది నమ్ముతారన్న సంగతి పక్కన పెడితే… ఓ హామీ అయితే ప్రకటించారు. ఇక గల్ఫ్ పాలసీ అనేది చాలా కాలంగా ఉన్న డి్మాండ్. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
అధికారంలోకి రాగానే కొత్త సంవత్సరం జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రధానంగా గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరిగా రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు కూడా బీమా అందిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఇళ్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాల కోసం త్వరలోనే కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. లోన్ తీసుకుని ఇళ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే ఆ లోన్‌కు సంబంధించిన వడ్డీని కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఇది సాధ్యమా లేదా అన్న సంగతి తర్వాత.. కానీ ప్రజల్లో ఆశలు పెట్టడానికి మాత్రం బాగానే ఉంటుంది. ఇవన్నీ బీఆర్ఎస్ ను ఎంత వరకూ కాపాడతాయన్నది చూడాల్సి ఉంది.