పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పదహారు శాతం ఓట్లే వచ్చాయి. ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పదకొండు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఒక చోట నాలుగో స్థానంలో నిలిచింది. ఐదు నెలల కిందట తిరుగులేని స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ దుస్థితి ఇది. ఇలా ఎందుకు పడిపోయింది ?. ఈ పతనం ఆగుతుందా అంటే చెప్పలేమనే పరిస్థితి. దీనికి కారణం ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ అంటూ ఆ పార్టీకి లేకుండా చేసుకోవడం.
ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఓటు బ్యాంక్ లేని పార్టీలకు విలువ ఉండదు. ఆ ఓటు బ్యాంక్ ఎక్కువగా కులం, మతం ఆధారంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకుని రాజకీయం చేసింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. కానీ కులం, మతం శాశ్వతం కానీ.. ప్రాంతీయ వాదం శాశ్వతం కాదు. ఈ లాజిక్ ను కేసీఆర్ మార్చిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ .. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తగ్గుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు దాన్ని లైవ్ లో ఉంచడానికి కేసీఆర్ ప్రయత్నించారు. కానీ దురాశతో దేశ రాజకీయాలు చేయాలన్న ఆలోచనతో.. మొత్తం సెంటిమెంట్ ను వదిలేశారు. ఫలితంగా ఇప్పుడు అసలు సొంత ఓటు బ్యాంక్ లేకుండా ఉన్న పార్టీగా మిగిలిపోయింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ , రెడ్డి వర్గాల మద్దతు ఉంది. బీజేపీకి ఉన్నత వర్గాల మద్దతు ఉంది. మజ్లిస్ కు ముస్లింల సపోర్ట్ ఉంది. మరి బీఆర్ఎస్ కు ఎవరి సపోర్ట్ ఉంది ?. నిన్నటి వరకూ కులమతాలకు అతీతంగా తెలంగాణ వాదుల సపోర్ట్ ఉంది. ఇప్పుడు అలాంటి సపోర్ట్ లేదు. ఒక్క కులం సపోర్ట్ లేదు. పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా ఏ వర్గాన్ని దగ్గరకు తీసుకోలకేపోయారు కేసీఆర్. బీసీ వర్గాల్లో ప్రధాన కులాలకు టిక్కెట్లు ఇవ్వకుండా గెలిచే స్థాయి లేదని అవమానించారు. ఈటల వంటి వారిని కుటుంబం కోసం బలి చేశారు. దీంతో బీసీ వర్గాలు కూడా దూరమయ్యాయి. అది ఎన్నికల్లో కనిపించింది.
ఇప్పుడు కేసీఆర్ కనీస ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలన్నా ఏదో ఓ వర్గాన్ని దగ్గరకు చేర్చుకోవాలి. పదేళ్ల పాలన చూసిన తర్వాత ఎవరైనా దగ్గరకు వస్తారా అంటే చెప్పడం కష్టమే. తెలంగాణ వాదం పూర్తిగా అడుగంటిపోయింది. ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా… నమ్మడానికి .. ఆవేశపడటానికి ప్రజలు సిద్ధంగా లేరని.. కేసీఆర్ తన మార్క్ బూతులతో విరుచుపడుతున్నా ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడంతోనే తేలిపోతుంది. అందుకే కేసీఆర్ భవిష్యత్ పై .. బీఆర్ఎస్ భవిష్యత్ పై ఆ పార్టీ నేతలు బెంగపెట్టుకుని తమ భవిష్యత్ కోసం.. వేరే దారి చూసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీని కాపాడుకోవడం అంత తేలిక కాదు.