బీఆర్ఎస్ అంటే… భారత రాష్ట్ర సమితి కావొచ్చు కానీ.. తెలంగాణ పార్టీనే. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వద్దనుకున్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం కావాలా వద్దా అన్న ప్రాతిపదికన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వద్దు.. రేవంత్ రెడ్డి ముద్దు అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ పరిణామాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా లోక్ సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఇందులోనూ ప్రభావం చూపించలేకపోతే పార్టీ మనుగడపై ప్రభావం పడుతుంది.
పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాల ప్రకారం జరుగుతాయి. ప్రధానిగా మోదీ ఉండాలా లేకపోతే కాంగ్రెస్ కూటమి నుంచి ఎవరైనా ఉండాలా అన్న టాపిక్ ఆధారంగా ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ అటు ఎన్డీఏలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేదు. బీఆర్ఎస్ కులోక్ సభ సీట్లు ఇవ్వడం వల్ల ఏంది ప్రయోజనం అనుకుంటే… మొదటికే మోసం వస్తుంది. జాతీయ పార్టీల నేతలు అయితే తెలంగాణ కోసం కొట్లాడరని.. తామే పార్లమెంట్ లో తెలంగాణకు రక్ష అని ప్రజల్ని నమ్మించాల్సి ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే నమ్మలేదు.. ఇక పార్లమెంట్ కు నమ్ముతారా అన్న టెన్షన్ సహజంగానే ఉంటుంది.
బీజేపీకి పదిహేడుశాతం వరకూ ఓట్లువచ్చాయి. ఇది చిన్న విషయం కాదు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి ఆ పార్టీకి మోదీ ఇమేజ్ తోడవుతుంది. కాంగ్రెస్ కు అధికార పార్టీ ఇమేజ్ ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. గతంలో సారు .. కారు.. పదహారు అని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సారి ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సిద్దిపేట బలంతో ఒక్క మెదక్ లోక్ సభ నియోజకవర్గం మాత్రమే ఆశావహంగా కనిపిస్తోంది. మిగతా దేనిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకే బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ప్రారంభమవుతోంది.