హరీష్ రావు కించ పరిచారని ఎప్పుడూ మీడియా ముందు ఇలాంటి అంశాలపై మాట్టాడని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అప్పల్రాజు మీడియా ముందుకు వచ్చారు. చాలా మాట్లాడేశారు. తర్వాత బొత్స కూడా ఏదో పైపైన స్పందించారు. మరి అసలు ఇలాంటి టాపిక్స్ పై మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదు ?. బీఆర్ఎస్… చేతకాని పరిపాలన అని తిట్టినా సరే వైసీపీ … ఏదో మీ అభిమానం సార్ అని అనుకుని వెళ్తుంది తప్ప… అలా ఎందుకన్నారని అడిగేంత రాజకీయం లేదు. కానీ ప్రజలు ఏమీ అనుకోకుండా ఎవరూ పట్టించుకోని నేతల్ని రంగంలోకి దింపి ప్రతి విమర్శలు చేస్తున్నాయి.
ఆరేడేళ్ల నుంచి బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ మధ్య స్నేహం ఉంది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగుతోంది. ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక అంశాలపై వీరు వివాదాలేమైనా రాజ్యాంగ వ్యవస్థల దగ్గరకు.. వెళ్తారు.. కేంద్రానికి ఫిర్యాదు చేసుకుంటారు కానీ.. రాజకీయంగా దూషించుకోరు. కానీ రాజకీయంగా మాత్రం పరస్పర సహకారం ఓ రేంజ్లో ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్న కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అటు బీజేపీని ఇరుకున పెట్టడంతో పాటు ఏపీలోనూ అడుగు పెట్టినట్లవుతుందని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. కానీ వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది. కానీ ఇబ్బందిని ఆ పార్టీ స్వాగతిస్తోందని అంటున్నారు. ఎందుకంటే ఇదంతా ఫ్రెండ్లీ అండ్ ప్లాన్డ్ ఫైట్ అనే అనుమానం ఉండటమే.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ తమకు మేలు చేస్తుందన్న అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ ఉందని చెబుతున్నారు. కాపు సామాజికవర్గం కార్డ్ తో బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని రెండు, మూడు శాతం ఓట్లు చీలినా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఈ రెండు పార్టీలు తెర వెనుక మాట్లాడుకుని తెర ముందు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఇప్పుడు అంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ప్రకారం జరుగుతోంది. ఇది కూడా అంతే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు.