బహుజనసమాజ్ పార్టీ అంటే.. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన పార్టీ అనుకుంటారు. కానీ ఆ పార్టీకి… తెలంగాణలో డిమాండ్ ఉంది. ఆ పార్టీకి సంబంధించి ఎక్కడా భారీ కార్యక్రమాలు జరగవు కానీ… ఆ పార్టీ బీఫాంల కోసం పోటీ పడేవాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా.. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ టిక్కెట్ల కోసం… నేతలు పోటీ పడుతున్నారు. బీఎస్పీకి ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత,గిరిజన,బీసీ,మైనార్టీ ఓట్లు ఓటు బ్యాంకులుగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీకి కొంచెం పట్టు ఉంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున ఇద్దరు గెలిచారు కూడా. వారిద్దరు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మరొకరు కోనేరు కోనప్ప. అందుకే ఇప్పుడు బీఎస్పీ టిక్కెట్ల కోసం.. బీజేపీ కన్నా ఎక్కువగా పోటీ పడుతున్నారు అక్కడి నేతలు .
బీఎస్పీ పట్ల ఆశావాహులు మొగ్గు చూపడానికి అనేక సమీకరణలు కనిపిస్తున్నాయి. బిఎస్పీ గుర్తు ఏనుగు అందరికీ సుపరిచితం కావడం…ఆ పార్టీకి అట్టడుగు వర్గాల్లో ఓటు బ్యాంకు ఉంది. వీటికి తమ వ్యక్తిగత ప్రాబల్యం తోడయితే గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. టిఆర్ఎస్కి మెజార్టీ నియోజకవర్గాల్లో అసంతృప్తులున్నారు. వీరిలో సీనియర్లు కూడా ఉన్నారు. ఎలాగైనా పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. కొంత మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఖానాపూర్ టిఆర్ఎస్ టికెట్ దక్కని రమేష్ రాథోడ్ టికెట్ హామీతో కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే అలాటి అవకాశం కూడా లేని నేతలంతా ప్రత్యామ్నాయంగా బిఎస్పీని ఎంపిక చేసుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ప్రధానపార్టీల టికెట్లు దక్కక,రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి,కోనేరు కోనప్పలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ తరపున నిర్మల్, సిర్పూర్ నుంచి పోటీ చేశారు. టిఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి అనూహ్య విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై పేరుకుపోయిన అసంతృప్తికి తోడు సొంత బ లంతో సంచలన విజయం సాధించారు. ఈ సెంటిమెంట్ కూడా.. టీఆర్ఎస్ నేతలను ఆకర్షిస్తోంది.
మంచిర్యాల టిఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని స్థానిక ఎంపిపి బేర సత్యనారాయణ ఆశించారు. అయితే అధినాయకత్వం తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావునే అభ్యర్థిగా ప్రకటించింది. దివాకర్ రావు ను మార్చాలని టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌ను కలిశారు. అయినా మార్పు చేసే సూచనలు లేకపోవడంతో.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. బిఎస్పీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో బీసీ,ఎస్సీ,మైనార్టీలే అధికంగా ఉన్నా…కాంగ్రెస్-టిఆర్ఎస్ లు అగ్రవర్ణాలకే టికెట్లు ఇస్తూ.అన్యాయం చేస్తున్నాయన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. సత్యనారాయణ సామాజికవర్గం పెరిక కులస్తుల ఓట్లు ఈ నియోజకవర్గంలో మెజార్టీ సంఖ్యలో ఉన్నాయి. బిఎస్పీ సీనియర్ నేత,
సత్యనారాయణ బాటలో నే ఉమ్మడి జిల్లాలోని మరి కొందరు నేతలు ఉన్నారు. ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఈ విధంగా బలమైన అభ్యర్థులు బిఎస్పీ తరపున బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈ పరిణామం టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారేలా ఉంది. ఇతర అన్ని జిల్లాల్లోనూ టిఆర్ఎస్ టికెట్లు దక్కని ముఖ్యనేతలు బిఎస్పీకి టచ్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత బిఎస్పీ టికెట్లకు పోటీ మరితంగా పెరిగేలా ఉంది.