దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఉత్తరప్రదేశ్ లోనే అత్యధికంగా 403 శాసనసభ, 80 లోక్ సభ స్థానాలున్నాయి. కనుక ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి అన్ని పార్టీలు చాలా పోటీ పడుతుంటాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభకి 2017లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార సమాజ్ వాదీ పార్టీ, భాజపా, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ (బి.ఎస్.పి.) పార్టీల మద్యనే ఉంటుంది. అన్ని పార్టీలకి ఆ ఎన్నికలు జీవన్మరణ సమస్యవంటివే గనుక వాటిలో ఎలాగైనా విజయం సాధించి అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నాయి.
2007-12 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకసారి అధికారం రుచి చూసిన బి.ఎస్.పి.అధినేత్రి మాయావతి ఈ ఎన్నికలు ఏదోవిధంగా విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని చాలా ఆశపడుతున్నారు. బి.ఎస్.పి. ఎక్కువగా దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. కానీ ఈసారి మాయావతి తన ఎన్నికల వ్యూహం మార్చుకొన్నారు. ఈసారి ఎన్నికలలో ఏకంగా 100 సీట్లని ముస్లింలకి కేటాయిస్తానని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంది కనుక వారిని ఆకర్షించగలిగితే మళ్ళీ అధికారంలోకి రావచ్చునని మాయావతి ఆలోచనగా కనిపిస్తోంది.
ముస్లింలకి 100 సీట్లు కేటాయిస్తానని ప్రకటించడం ద్వారా మిగిలిన పార్టీలని కూడా ఆ సంఖ్య వద్ద లాక్ చేసినట్లయింది. అవి కూడా తప్పనిసరిగా 100కి తక్కువ కాకుండా సీట్లు కేటాయించవలసి ఉంటుంది లేకుంటే తమ పార్టీయే ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తోందని మాయావతి చాటింపు వేసుకొని వారిని ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు.
అయితే అధికార సమాజ్ వాదీ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ బలంగానే ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి లౌకికముద్ర ఉంది కనుక దానికి కూడా రాష్ట్రంలో ముస్లింల మద్దతు బాగానే ఉంది కానీ ఈసారి రాష్ట్రంలో అగ్రవర్ణాల ప్రజలని ఆకట్టుకొనేందుకు బ్రాహ్మణ కులానికి చెందిన డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని భావిస్తోంది. భాజపా తరపున కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేదా రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ నేతని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తోంది. ఒకవేళ అన్ని పార్టీలు ముస్లింలని ఆకట్టుకొనేందుకు ఎక్కువ సీట్లు కేటాయించినట్లయితే, వీలయినన్ని ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి ఆ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాలనుకొంటున్న మజ్లీస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చు.