తెలుగు360 రేటింగ్ : 2.25/5
కుర్రాళ్ల సినిమా అంటే అర్థం మారిపోయింది. ప్రేమలూ, ముద్దులూ, కౌగిలింతలూ, జోషూ… చివర్లో వీలైతే కాస్త మెసేజూ. వీటితో సరిపోతుందా అంటే… ఈరోజుల్లో, ఇప్పటి యువతరం అభిరుచులకు మాత్రం చాలదు. వీటికి మించిన బూస్టప్ ఏదో ఇవ్వాలి. అది క్యారెక్టరైజేషన్ నుంచి వస్తుందా, కథలోంచి పుడుతుందా? సన్నివేశాల అల్లిక నుంచి ఉద్భవిస్తుందా? అనేది దర్శకుడి ఛాయిస్. ఏం చెప్పినా, ఎలా చెప్పినా బలంగా చెప్పాలి. కొడితే… బ్రహ్మాండం బద్దలవ్వాలి. అంతే. అంత ఫోర్స్ లేకపోతే – సినిమాలు నడవడం లేదు. ‘యానిమల్’ చూశాం కదా?! మన ‘బేబీ’ మనకు నచ్చింది కదా? అలాగన్నమాట. యువ హీరోలు కొంతమంది ఈ సూత్రాన్నే నమ్ముకొని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అడుగులు వేద్దాం అనుకొంటున్న రోషన్ కనకాల కూడా అలాంటి ఫార్ములాలోనే ఓ కథ ఎంచుకొన్నాడు. అదే ‘బబుల్ గమ్’. టైటిల్… క్యాచీగా ఉంది. ట్రైలర్ టెమ్టింగ్ గా ఉంది. ఇంకేం కావాలి? ఈ సినిమాపై ఫోకస్ పెరగడానికి. మరి సినిమా ఎలా ఉంది? ‘బబుల్ గమ్’లా సాగిందా? లేదంటే బిర్యానీలా ఘాటెక్కిందా?
మనిషికి ఇజ్జత్ ముఖ్యం అనుకొనే బస్తీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల). డీజేగా సెటిల్ అవ్వాలన్నది తన కోరిక. అలాంటి ఆది జీవితంలోకి జానూ (మానస చౌదరి) వస్తుంది. జానూది పెద్దింటి కుటుంబం. విదేశాల్లో చదువుకోవాలనుకొంటుంది. ఆదిని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. అయితే… ఓ చిన్న కమ్యునికేషన్ గ్యాప్ వల్ల అందరి ముందూ ఆదిని అవమానిస్తుంది జాను. దాంతో ఆది రగిలిపోతాడు. తన ప్రేమని వదిలి కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకొంటాడు. అదేమిటి? అసలు జానూతో ఆదికి గొడవెందుకు వచ్చింది? వీరిద్దరూ మళ్లీ కలిశారా, లేదా? అనేదే మిగిలిన స్టోరీ!
ప్రతీ కథకూ అంతర్లీనంగా ఓ ఉద్దేశం ఉంటుంది. దర్శకుడు అనుకొన్నా, అనుకోకపోయినా ఒక్కోసారి ప్రేక్షకులకు కన్వే అవుతుంది. దాన్ని సినిమా భాషలో లాగ్ లైన్ అంటారు. ‘బబుల్గమ్’ కథని డీ కోడ్ చేస్తే.. ”లవ్ లో ఫెయిల్ అయితే.. గడ్డాలూ మీసాలూ పెంచుకొని దేవదాసులు అవ్వకండి. మీ గోల్ పై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరే ఎక్కువగా ప్రేమించుకోండి” అనే లాగ్ లైన్ పుట్టుకొస్తుంది. బహుశా దర్శకుడు ఇదే పాయింట్ ని మైండ్ లో పెట్టుకొని ఈ కథ రాసి ఉంటాడు.
ఓపెనింగ్ సీన్లోనే హీరో అర్థరాత్రి, అండర్‌వేర్‌తో బుల్లెట్ నడుపుకొంటూ వస్తుంటాడు. ఆ కోపం.. క్రోధం, కసి చూసి.. జరగరానిదేదో జరిగిపోయిందన్న విషయం అర్థం అవుతుంది. అక్కడి నుంచి కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఆది జీవితాన్ని, కుటుంబాన్నీ, లక్ష్యాన్నీ, స్నేహాల్నీ చూపించుకొంటూ కథని మొదలెట్టిన దర్శకుడు.. జానూ ఎంట్రీతో ప్రేక్షకుల్ని లవ్ స్టోరీలోకి లాక్కెళ్లాడు. ఓ పేదింటి అబ్బాయి, గొప్పింటి అమ్మాయి మధ్య ఎలాంటి లవ్ స్టోరీ నడుస్తుందో అలాంటి ప్రేమకథే తెరపై చూపించాడు. జానూ క్యారెక్టర్ పూర్తిగా అల్ర్టా మోడ్రన్‌గా రాసుకొన్నాడు దర్శకుడు. తన మైండ్ లో ఏముందన్నది ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థం కాదు. ఆదితో తన రిలేషన్ టైమ్ పాసా? సీరియస్సా? అనేది ఓ ఫజిల్ లా ఉంటుంది. ‘అబ్బాయిల్ని టాయ్స్‌లా వాడుకోవాలి’ అని ఓ సందర్భంలో హీరోయిన్‌తో పలికించిన విధానం చూస్తే.. ఇదేదో ‘ఆర్.ఎక్స్ 100’ స్టోరీలా అనిపిస్తుంది. కథని అలా నడిపినా బాగుండేది. కానీ చివరికి మామూలు ప్రేమకథలానే ట్రీట్ చేశారు. ఇంట్రవెల్ వరకూ కథలో ఎలాంటి జర్కులూ ఉండవు. విశ్రాంతికి ముందు అండర్ వేర్‌తో బుల్లెట్ ఎందుకు నడపాల్సివస్తుందో క్లారిటీ వస్తుంది.
లవ్ లో పడి, అందులో దొర్లిన ఓ యువకుడికి… ఇంతకంటే అవమానం ఏముంటుంది? అనిపించేలా ఇంట్రవెల్ సీన్ తీశాడు దర్శకుడు. అలాంటి అవమానం తరవాత హీరో తన ప్రతీకారం ఎలా తీర్చుకొంటాడో చూడాలనిపిస్తుంది. కానీ.. ఇంట్రవెల్ తరవాత కథని మొదలెట్టిన విధానంలోనే దర్శకుడు ఆ ప్రతీకారాన్ని కూడా లైట్ తీసుకొన్నాడనిపిస్తుంది. అప్పటి వరకూ జరిగిన అవమానం తలచుకొని కుతకుతలాడిపోయిన హీరో, హీరోయిన్ కనిపించగానే సైలెంట్ అయిపోతాడు. తన ఇంటిలోకి రానిస్తాడు. బిర్యానీ వండితే తింటాడు. ముద్దులు పెట్టుకొంటాడు. అన్నీ చేస్తాడు. కానీ మధ్యమధ్యలో ‘ఇజ్జత్.. ఇజ్జత్’ అంటూ పాత పాట పాడుతుంటాడు విచిత్రంగా. అసలు హీరో పాత్ర ఏమిటి? దాన్ని ఎలా నడపాలి? అనే విషయంలో దర్శకుడికి క్లారిటీ ఉందా, లేదా? అనే అనుమానం వస్తుంది. హీరోయిన్ని హీరో ఇంటికి షిఫ్ట్ చేసి, ‘బొమ్మరిల్లు’ ట్రీట్ మెంట్ని మరోసారి గుర్తు చేశాడు దర్శకుడు. అయితే అక్కడా రొటీన్ సీన్లు పడ్డాయి. కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు క్లూ లెస్‌గా వదిలేశాడు. అమ్మకు నడుం నొప్పి, హీరో చిన్నప్పుడు ధ్వంసం చేసిన కారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడే వైవా హర్ష క్యారెక్టర్.. ఇవన్నీ కథకు అవసరం లేని, అక్కర్లేని డీటైలింగ్సే. ఇంట్రవెల్ సీన్లో కూడా అదేదో బలవంతంగా చొప్పించిన సంఘర్షణ లానే ఉంటుంది. బాధలో ఉన్నవాళ్లని ఓదార్చడానికి ఎవరైనా లిప్ లాక్ ఇస్తారా? ఎంత కుర్రాళ్ల సినిమా అయినా మరీ ఇంత లిబర్టీనా?
హీరోయిన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న హీరో ఏం చేస్తాడంటే.. ఏమీ ఉండదు. నాన్న దగ్గర రూ.30 వేల జీతానికి పనికి కుదురుతాడు. అంతే. చివర్లో కూడా ‘మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండ్రా’ అంటాడు. కానీ ఎక్కడికి వచ్చాడో.. ఎవరికీ ఏం అర్థం కాదు. చిన్న పాటతో… వైరల్ అయి, ఫేమస్ అయిపోవడం లాంటి సీన్లతో సినిమాల్ని నడిపిద్దాం అనుకొంటే, ఏం చేయగలం? ఓ పాటలో.. పదానికొకటి చొప్పున హీరో, హీరోయిన్లు తెగ ముద్దులు పెట్టేసుకొంటారు. ఇలా తీయడమే యూత్ ఫుల్ సినిమా అనుకొంటే ఇంకేం చెప్పగలం? మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకోండి.. అని చెప్పడం కోసం దర్శకుడు ఈ కథ రాసుకొంటే, ఆ ఫీలింగ్ సినిమా చూస్తున్నప్పుడే కలిగేయాలి. సెకండాఫ్ మొదలైనప్పుడే ఆ దిశగా కథని నడపాలి. కానీ దర్శకుడు అది చేయలేదు. చివర్లో హీరో ఏడుస్తూ హీరోయిన్ దగ్గర ఈ డైలాగ్ చెప్పినప్పుడు ‘ఓహో.. దర్శకుడి ఉద్దేశ్యం ఇదా’ అనిపిస్తుంది.
రోషన్‌లో మంచి ఈజ్ ఉంది. ఎక్కడా నటించినట్టు అనిపించలేదు. పాత్రలో ఇమిడిపోయాడు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సర్దుకుపోవొచ్చు. ఎందుకంటే తనకు ఇది మొదటి సినిమా. డాన్సులు బాగా చేశాడు. మానస చౌదరి ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కోలా ఉంది. మొత్తానికి హీరోకి అక్కలా ఉంది. ఎమోషన్ సీన్లలో మానసని క్లోజప్‌లో పెట్టి మరింతగా ప్రేక్షకుల్ని ఏడిపించేశాడు దర్శకుడు. హీరో తండ్రి పాత్రలో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు నటించాడు. ‘మా తమ్ముడు సిద్దు జొన్నల గడ్డ తెలుసా’ అని చెప్పడానికో, లేదంటే స్వతహాగా అబ్బేసిందో తెలీదు కానీ, సిద్దులా నటించడానికి తెగ తాపత్రయపడ్డాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సేమ్ టూ సేమ్. తనకు రాసిన డైలాగుల వల్లో, ఆ పాత్రలో ఉన్న ఆకర్షణ వల్లో.. కాస్త ఫన్ పండింది. ఈ సినిమాలో ఉన్న రిలీఫ్.. ఆయనే. ‘బబుల్ గమ్’ సెట్ ముందు వాకింగ్ చేస్తున్న బ్రహ్మానందాన్ని మధ్యలో ఆపి, ఓ క్యారెక్టర్ అప్పజెప్పినట్టున్నారు. ఆయన ఇలా కనిపించి, అలా మాయమైపోయారు. అసలు ఆ పాత్ర కాస్త కూడా రిజిస్టర్ కాదు. మరి ఎందుకు చేశారో..? హీరో పక్కన స్నేహితుల్లా కనిపించిన ఇద్దరూ మంచి టైమ్ పాస్ అందించారు. కాకపోతే ఒకరు తెలంగాణ, ఇంకొకరు ఆంధ్రా యాసలో మాట్లాడేస్తుంటారు. ఆ కంటిన్యుటీ కూడా అప్పుడప్పుడూ తప్పి పోయింది.
మాస్ పాట ఒకటి బాగుంది. ఇజ్జత్ గీతంలో రాప్ ఆకట్టుకొంది. అవసరం ఉన్నా, లేకున్నా బీజియమ్స్ కొట్టేసి, బ్యాగ్ గ్రౌండ్‌తో సినిమాని లేపడానికి సంగీత దర్శకుడు నానా పాట్లూ పడ్డాడు. కెమెరావర్క్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు కథకు సరిపడా ఉన్నాయి. ఈ కథ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం ఏమైనా, చెప్పే విధానంలో స్పష్టత లోపించింది. తనని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడన్నది పాయింట్ అయితే కొత్తగా ఉండేది. కానీ.. అది తప్ప ఇంకేదేదో చెప్పాడు దర్శకుడు.
కొన్ని టైటిళ్లు చూస్తే బాధేస్తుంటుంది. పోస్టర్ మీద టైటిల్ ఒకటి, లోపల సినిమా ఇంకొకటి. ఇంకొన్ని మాత్రం టైటిల్ కి వంద శాతం న్యాయం చేసేస్తుంటాయ్. ‘బబుల్ గమ్’లా. బబుల్ గమ్ అంటే ఏమిటి, దాని ప్రత్యేకతలు ఎన్ని అని అడిగితే చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండవు. నోట్లో వేసుకొన్న కాసేపటికే రుచీ, పచీ లేని ఓ సాగుడు పదార్థంలా తయారయ్యేదే బబుల్ గమ్! అది నమలడం వల్ల కలిగే లాభాలేంటి? అని ఎవరైనా అడిగితే ‘దవడ నొప్పి’ అని తప్ప, చెప్పడానికి ఇంకేం ఉండదు. ఈ బబుల్ గమ్ కూడా అంతే.
తెలుగు360 రేటింగ్ : 2.25/5
-అన్వర్