ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఆస్వాదించారు శ్రోతలు. ఆయన బాణీలు ఎప్పుడో ఎల్లలు దాటాయి. సినిమా పోస్టర్ పై ఆయన పేరు వుంటే ఆటోమేటిక్ గా బ్రాండ్ వాల్యు యాడ్ అయిపోతుంది. ఇండియన్ సినిమా సంగీతంలో ఎ.ఆర్ రెహమాన్ ది ప్రత్యేక ప్రస్థానం.
తెలుగులో కూడా ఆయన సంగీతానికి అశేష అభిమానులు వున్నారు. అయితే తెలుగులో ఇంత ఫాలోయింగ్ వున్న రెహమాన్ ఇప్పటివరకూ ముచ్చటగా ముగ్గరు తెలుగు దర్శకులతోనే పని చేశారంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది.
నిజమే.. ఇప్పటివరకూ రెహమాన్ కేవలం ముగ్గురు తెలుగు దర్శకులతోనే పని చేశారు. నిప్పురవ్వ-బీజీఎం(ఎ.కోదండరామి రెడ్డి), సూపర్ పోలీస్ (కె. మురళి మోహన్ రావు), గ్యాంగ్ మాస్టర్( బి.గోపాల్). కెరీర్ బిగినింగ్ లోనే ముగ్గురు దర్శకులు తప్పితే మరో తెలుగు దర్శకుడితో చేతులు కలపలేదు రెహ్మాన్.
రెహమాన్ నేరుగా తెలుగులో చేసిన సినిమాలు.. నీ మనసు నాకు తెలుసు (జ్యోతి కృష్ణ) నాని, కొమరం పులి (ఎస్జే సూర్య) ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా (గౌతం మీనన్).. వీరంతా తమిళ దర్శకులే.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడో తెలుగు దర్శకుడు ‘రెహమాన్’ తో చేతులు కలిపాడు. తనే.. బుచ్చిబాబు. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకి రెహమాన్ ని ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు.
సినీ సంగీతంలో రెహమాన్ ది ప్రత్యేకమైన బాణీ. ట్యూన్ కంపోజింగ్, వాయిద్య ప్రయోగం, పాటని సంపూర్ణంగా ముస్తాబు చేయడంలో ఆయన ముద్ర ఉంటుంది. కాస్త మ్యూజిక్ సెన్స్ వున్న శ్రోతలు సౌండ్ విని అది రెహ్మాన్ కంపోజ్ చేశారో లేదో చెప్పగలరు. అంతలా పాతుకుపోయింది రెహ్మాన్ మార్క్.
రెహమాన్ తో వర్క్ చేయడం కూడా ఒక ఛాలెంజ్. సినిమాల గురించి లోతుగా అవగాహన వున్న ఫిల్మ్ మేకర్స్ తోనే చాలా వరకూ జర్నీ చేశాడాయన. మణిరత్నం, శంకర్, సుభాష్ ఘాయ్, అశుతోష్ గోవారికర్, రాజ్‌కుమార్ సంతోషి, రాజీవ్ మీనన్, గౌతం మీనన్, మురగదాస్.. ఇలా పేరెన్నిక గల దర్శకులే ఆయన ఫిల్మోగ్రఫిలో రిపీటెడ్ గా కనిపిస్తారు.
దాదాపు ముఫ్ఫై ఏళ్ల తర్వాత రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్ సినిమాకి బుచ్చిబాబు రూపంలో ఇప్పుడో తెలుగు దర్శకుడు రెహ్మాన్ తో సంగీతం చేయించడం విశేషమే. ప్రస్తుత రెహ్మాన్ ఫాంపై చాలా కామెంట్స్ వినిపిస్తుంటాయి. రెహ్మాన్ మ్యూజిక్ మాస్ కి అందేలా వినిపించడం లేదని, కొత్త ఆడియన్స్ ని వెదుక్కునే క్రమంలో ఆయన సినిమా పాటని కావాల్సినదాని కంటే ఎక్కువ ప్రయోగాల బాట పట్టించారనే విశ్లేషణలు వస్తుంటాయి.
ఇళయరాజా, ఎంఎస్వీ పాటలు ఉదృతంగా వినిపిస్తున్న సమయంలో అప్పటి మ్యూజిక్ కి రివర్స్ ఇంజనీరింగ్ చేసి రెహ్మాన్ తనకంటూ ఓ కొత్తబాణీ వినిపించి సంగీత ప్రపంచంలో నిలబడ్డారు. ఇప్పుడు రెహ్మాన్ తన మ్యూజిక్ కి తానే మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో బుచ్చిబాబు రెహ్మాన్ తో జతకట్టారు. రామ్ చరణ్ సినిమా అంటే పాటలు మాస్ కి రీచ్ అవ్వాల్సిందే. అలాంటి పాటలు తీసుకోవాల్సిన బాధ్యత రెహమాన్ కంటే దర్శకుడిగా బుచ్చిబాబుపైనే ఎక్కువ వుంది.
బుచ్చిబాబు మ్యూజిక్ టేస్ట్ పై ఎవరికీ అనుమానాలు లేవు. తొలి సినిమా ఉప్పెన మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇప్పుడు తన స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారమే రెహ్మాన్ వైపు అడుగులు పడివుంటాయి. రెహ్మాన్ కి కూడా ఇది మంచి అవకాశం. రామ్ చరణ్ సినిమా పాటలకు ఖచ్చితంగా సెపరేట్ రీచ్ వుంటుంది. రెహ్మాన్ మళ్ళీ మాస్ ని మెస్మరైజ్ చేయడానికి ఇదొక మంచి ఛాన్స్.