Buddy Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్
అల్లు శిరీష్ కెరీర్ ఇంకా సక్సెస్ ట్రాక్ లోకి రాలేదు. సక్సెస్ వచ్చిన వెంటనే మరో ఫెయిల్యూర్ పలకరిస్తోంది. తను పరిశ్రమలోకి వచ్చి పదేళ్ళు దాటింది. ఈ పదేళ్ళలో శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో మాత్రమే ఎంతోకొంత చెప్పుకోదగ్గ సినిమాలు. ఇప్పుడాయన ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అదే ‘బడ్డీ’. తమిళ్ లో ఆర్య హీరోగా వచ్చిన ‘టెడ్డి’ సినిమాకి రిమేక్ ఇది. ఆ సినిమాని నిర్మించిన జ్ఞానవెల్ రాజానే బడ్డీ సినిమాని కూడా నిర్మించారు. మరి రిమేక్ చేయదగ్గ బడ్డీ కథ ఏమిటి ? తెలుగులో ఎలాంటి మార్పులు చేశారు? ఈ బడ్డీ, శిరీష్ కి మరో విజయాన్ని ఇచ్చిందా ?
ఆదిత్య రామ్(అల్లు శిరీష్) కెప్టెన్ పైలెట్. పల్లవి (గాయత్రి భరద్వాజ్) వైజాగ్ లో ఏసీటీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్). పల్లవి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి సరైన సిగ్నల్స్ ఇవ్వడంలో ఆదిత్య హెల్ప్ చేస్తాడు. అలా ఆదిత్యపై పల్లవికి ప్రేమ పుట్టేస్తుంది. అయితే ఆదిత్యకి పల్లవి పేరు కూడా తెలీదు. తనని ఏసీటీ అని జాబ్ టైటిల్ తోనే పిలుస్తుంటాడు. ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరౌతారు. ఆదిత్య ఓ టెడ్డీ బేర్ ని పల్లవికి గిఫ్ట్ గా పంపిస్తాడు. ఆదిత్యని నేరుగా కలసి తన ప్రేమని చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటుంది పల్లవి. ఇంతలో పల్లవిని ఎవరో కిడ్నాప్ చేసి కోమాలోకి వెళ్ళే విధంగా మత్తు మందు ఇస్తారు. ఈ ప్రమాదంలో పల్లవి శరీరం నుంచి తన ఆత్మ విడిపోయి టెడ్డిబేర్ లో చేరుతుంది. తర్వాత ఏం జరిగింది ? అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు ? పల్లవి శరీరంలోకి తన ఆత్మతిరిగి వచ్చిందా? పల్లవి తన ప్రేమని ఆదిత్యతో చెప్పగలిగిందా ? ఇదంతా మిగతా కథ.
టెడ్డి సినిమా కథే ఓ హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తి. ఇప్పుడు మళ్ళీ టెడ్డి కథనే బడ్డీగా తీసుకొచ్చారు. చాలా మార్పులు చేశామని సినిమా యూనిట్ చెప్పింది కానీ పైలెట్ సెటప్ తప్పితే.. మూలకథ, మలుపులు, కథా గమనంలో దాదాపుగా టెడ్డినే ఫాలోఅయ్యారు. టెడ్డి చూసిన ఆడియన్స్ కి బడ్డీ ఓ పాత సినిమా ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. నేరుగా బడ్డీ ని చూసిన ఆడియన్స్ కి మాత్రం కథలో సోల్ మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది.
ఐడియా పరంగా చూసుకున్నా బడ్డీ కథ ఎవరూ టచ్ చేయని పాయింట్ ఏమీ కాదు. ‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్'( శరీరం నుంచి వెలువడిన ఆత్మ మరో మాధ్యమంలోకి వెళ్ళడం) బ్యాక్ డ్రాప్లో తెలుగులోనే చాలా సినిమాలు వున్నాయి. ఈగ, టాక్సీవాలా, ఎందుకంటే ప్రేమంట.. ఈ కోవలోని కథలే. ఇవన్నీ కూడా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ముడిపడి వున్న కథలు. ఇలాంటి కథలని ఎంతగా ఆర్గానిక్ గా చూపించామనే పాయింట్ పైనే సినిమా విజయం ఆధారపడి వుంటుంది. బడ్డీ విషయానికి వస్తే ఈ సహజత్వం మిస్ అయ్యింది.
హాంగ్ కాంగ్ లో ఓ పెద్ద డాన్ తన కొడుకు గుండె ఆపరేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలని ఎస్టాబ్లెస్ చేస్తూ కథ మొదలౌతుంది. మాఫియా డాక్టర్ అజ్మల్ ఎంట్రీతో ఈ కథపై ఒక క్లారిటీ వచ్చేస్తది. మధ్యలో క్రూరుడైన అజ్మల్ క్యారెక్టర్ తప్పితే అప్పుడెప్పుడో చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఒక్కడున్నాడు సెటప్ తో కథ ముందుకు కదులుతుంటుంది. నిజానికి ఇలాంటి కథల్లో ఎమోషన్ ని ప్రేక్షకుడికి పట్టించడం అంత తేలిక కాదు. ఇరు పక్షాలు కూడా బ్రతకడానికి చేస్తున్న ప్రయత్నాలే. ఆ ప్రయత్నాలు చూసి జాలి పడటం తప్పితే మరో ఎమోషన్ పైకి రాదు.
Also Read : మంచి నిర్ణయం ‘బడ్డీ’…!
బొమ్మతో కావాల్సినంత ఎంటర్టైమెంట్ పంచాలని చూశారు. అయితే ఆ సెటప్ ఆర్గానిక్ లేదు. బొమ్మ మాట్లాడుతుంటుంది గానీ అందులో లైఫ్ ఆడియన్ ఫీలయ్యేలా లేదు. నిజానికి ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు రాజమౌళి ‘ఈగ’ సినిమా స్టడీ చేయాలి, నాని ఆత్మని ఈగ లోకి తీసుకొచ్చి ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన తీరు మెస్మరైజింగ్ వుంటుంది. సినిమా అంతా ఓ బొమ్మ చుట్టూనే నడుస్తుందనుకున్నప్పుడు ఆ బొమ్మకి ప్రాణం పోయడానికి చాలా కసరత్తు చేయాల్సింది. కానీ ఇందులో ఆ పార్ట్ అంతా సింపుల్ గా తేల్చేశారు. అంతకుముందు కూడా హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ సరిగ్గా ఎస్టాబ్లెస్ చేయలేదు.
ఫస్ట్ హాఫ్ వరకూ కథ ఎదోలా ముందుగు సాగుతుంది కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి హాంకాంగ్ లో జరిగే ప్రహసనం అంతా ఓవర్ డ్రామాగా అనిపిస్తుంది. నవ్వాలో సీరియస్ గా ఫీలవ్వాల్లో అనే క్వశ్చన్ మార్క్ ప్రేక్షకుడిది. హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ పండలేదు. కథనం అంతా ప్రేక్షకుకి అంచనాకు ముందే అందిపోతుంది. దీంతో సిల్వర్ స్క్రీన్ కాకుండా ఫోన్ స్క్రీన్ చూసే పరిస్థితి నెలకొంటుంది. ఇక సుదీర్గంగా సాగే క్లైమాక్స్ అయితే ఒక దశలో సహనానికి పరీక్ష పెడుతుంది. ఒకే సీన్ లో ఎమోషన్, ఫన్, ట్విస్ట్, యాక్షన్ చూపించేయాలని అనుకోవడం డైరెక్షన్ డిఫెక్ట్.
బడ్డీలో ప్లస్ పాయింట్స్ లేకపోలేదు. సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. బడ్డీ చేసే కొన్ని విన్యాసాలు పిల్లలకు నచ్చుతాయి. ఆర్ఆర్ఆర్, బాలయ్య భగవంత్ కేసరి రిఫరెన్స్ లు వినోదాన్ని పంచుతాయి. హిప్ హప్ నేపధ్య సంగీతం గ్రిప్పింగ్ గా వుంటుంది.
అల్లు శిరీష్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తొలి సగంలో చలాకీగా కనిపించాడు. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒకటే ఎక్స్ ప్రెషన్ కి ఫిక్స్ అయిపోయాడు. హాంకాంగ్ చేరిన తర్వాత ఈ కథని ‘వరుణ్ డాక్టర్’ లా డార్క్ కామెడీతో డీల్ చేసే ఛాన్స్ వుంది. కానీ దర్శకుడు ఆ ఛాయిస్ తీసుకోలేదు. చాలా ఫ్లాట్ నేరేషన్ తో వెళ్ళిపోయాడు. దీంతో శిరీష్ క్యారెక్టర్ కూడా ఫ్లాట్ అయిపొయింది. గాయత్రి భరద్వాజ్ కి స్క్రీన్ టైం తక్కువే. అజ్మల్ మాత్రం క్రూరమైన విలనిజం చూపించాడు. అలీ పాత్ర కూడా చప్పగానే వుంటుంది. ముకేష్ రుషి ఇలాంటి పాత్ర చేయడం కొత్తే. మిగతా నటీనటులు కథమేరకు కనిపించారు.
ఈ సినిమాలో విలన్ ‘ఎన్నిసార్లు వస్తావ్ రా’ అని శిరీష్ ని అడుగుతాడు. ‘విజయం సాధించే వరకూ’ ఇది శిరీష్ ఆన్సర్. ఈ లెక్కన విజయం కోసం శిరీష్ మరో సినిమాతో రావాలి.
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్