కేంద్ర బడ్జెట్ లో విరివిగా తమకు కేటాయింపులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా ఆశలుపెట్టుకుంది. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, కేంద్రం ఇచ్చిన హామీల్లో కొన్నైనా కచ్చితంగా నెరవేర్చేందుకు కేంద్రం చొరవ చూపుతుందని అంతా భావించారు. కానీ, చివరికి వచ్చేసరికి ఏం జరిగింది..? అరకొర కేటాయింపులే తప్ప, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకంగా కేటాయించినవి అంటూ ఏవీ ఈ బడ్జెట్ లో కనిపించడకపోవడం నిరాశను కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. విభజన హామీలు చాలా ఉన్నాయి కాబట్టి, ఈసారి కేటాయింపులు ఇబ్బడిముబ్బడిగా ఉంటానే అంచనాలు ఏర్పడ్డాయి. ఏపీ టీడీపీ ఎంపీలు కూడా ఈ బడ్జెట్ మనకు అత్యంత అనుకూలంగా ఉండబోతోందన్న ధీమా వ్యక్తం చూస్తూ ప్రకటనలు చేశారు. తాము అడిగినవాటిలో కనీసం కొన్నైనా నెరవేరడం ఖాయమని అనుకున్నారు. కానీ, చివరికి కేంద్రం నిరాశ పరిచింది.
ఆంధ్రాతోపాటు తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలకు ప్రతీయేటా ఇచ్చినట్టుగా విదిల్చారే తప్ప.. ప్రత్యేకంగా అదనంగా ఇచ్చిందేం లేదు! విశాఖ పోర్టుకు రూ. 108 కోట్లు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ. 32 కోట్లు, సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 10 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. 10 కోట్లు, ఎన్.ఐ.టి.కి రూ. 54 కోట్లు, ఐఐటీకి రూ . 50 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ. 30 కోట్లు, ఐఐఎమ్ కి రూ. 42 కోట్లు, ఐఐఎసీఆర్కి రూ. 49 కోట్లు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కు రూ. 19.6 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు అనే ప్రస్థావనా లేదు. ద్రవ్యలోటు పూడ్చుతామంటూ గతంలో కేంద్రం చేసిన ప్రకటనల జోలికి కూడా జైట్లీ వెళ్లలేదు. ఏపీ పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రోత్సహాకాలంటూ ఏపీకి లేనే లేవు.
ఇక, తెలంగాణ విషయానికొస్తే… ఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా కొన్ని కేటాయింపులు చేసి, మమ అనిపించేశారనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు నిధులు కేటాయింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఆశిస్తోంది. ఈ మేరకు కేంద్రాన్ని కేసీఆర్ సర్కారు చాలాసార్లు కోరింది. కానీ, జైట్లీ ఆ జోలికే వెళ్లలేదు. మిషన్ కాకతీయ కార్యక్రమం విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ సర్కారు పెట్టుకున్న మొరను కేంద్రం ఆలకించలేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేయాలంటూ గతంలో కోరారు.. ఆ ఊసూ లేదు. ఓవరాల్ గా చూసుకుంటే… ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం.
బడ్జెట్ అంతా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని భాజపా నేతలు చెబుతున్నారు. బడ్జెట్ బాగానే ఉందంటూ ఏపీ ఆర్థికమంత్రి రామకృష్ణుడు అంటున్నారు. అయితే, బడ్జెట్ కాపీ అంతా చదివిన తరువాత ఆంధ్రాకు జరిగిన మేలు ఎంత అనేది తెలుస్తుందన్నారు. విభజన హామీలపై ఒక్కటంటే ఒక్కటి కూడా స్పష్టత లేదంటూ వైకాపా ఎంపీలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా, తెలుగు రాష్ట్రాల డిమాండ్లను కేంద్రం పెద్దగా పట్టించుకోలేదనేది చాలాచాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రాల అవసరాల కంటే, భాజపా రాజకీయ అవసరాలే ఈ బడ్జెట్ లో కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల మాట.