36 మందితో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొదటగా తీసుకున్న నిర్ణయం.. అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఆలయాన్ని కుదించడం. గత సర్కార్ అమరావతిలో … రూ. 150 కోట్లతో రెండు విడతల్లో.. అచ్చంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉండేలా.. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టింది. పునాదులు పడ్డాయి. నిర్మాణం కూడా ప్రారంభమయింది. కానీ.. ప్రభుత్వం మారింది. అమరావతి జాతకం కూడా మారిపోయింది. అలాగే.. అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఆలయం కూడా.. చిక్కిపోయింది. అసలు పాలకమండలి ఏర్పడక ముందే.. ప్రభుత్వం ఆలయాన్ని కుదించాలని నిర్ణయం తీసుకుందని బయటకు వచ్చింది. ఇప్పుడు.. తొలి పాలక మండలి భేటీలోనే.. దీనికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత అవసరాల మేరకు రూ.36 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.
అమరావతి ఆలయం వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని.. పలువురు స్వామిజీలు కూడా ప్రభుత్వానికి, టీటీడీకి విజ్ఞప్తి చేశారు. అయితే.. వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక … వైసీపీ కి మద్దతుగా నిలిచిన స్వామీజీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిందూత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయలేదు. తొలి పాలక మండలి భేటీలో 190కిపైగా నిర్ణయాలు తీసుకున్నా… తొలి సమావేశం కాబట్టి.. బయటకు చెప్పలేమని వైవీ సుబ్బారెడ్డి.. కొన్నింటిని మాత్రమే.. వెల్లడించారు. తిరుమలలో నీటి సమస్య పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామని.. అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను… బాలాజి రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లిస్తామని ప్రకటించారు.
తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత… టీటీడీ నిధులను కేటాయించడం సమంజసం కాదని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జంబో పాలక మండలి తొలి భేటీ గందరగోళంగా ముగిసింది. ప్రమాణస్వీకారాల హడావుడి , సంప్రదాయాలు.. అధికారుల హడావుడి అన్నీ కలిసిపోయాయి. సభ్యులందరిలో శేఖర్ రెడ్డి హైలెట్ గా నిలిచారు. తనపై కేసులేమీ లేవని.. నోట్ల రద్దు సమయంలో సీబీఐ అధికారులకు తన వద్ద రూ. 12 లక్షలు మాత్రమే దొరికాయని… ఇక తనపై ఆరోపణలను నిలిపివేయాలని ఆయన మీడియాను కోరారు.