గుణశేఖర్ దగ్గర ఓ అలవాటు ఉంది. ఎంత చిన్న కథైనా.. భారీ స్థాయిలో చెబుతాడు. సెట్లూ, హంగులకు భారీగా ఖర్చు పెడతాడు. అందుకే తాను అనుకొన్న బడ్జెట్ లో సినిమా ఎప్పుడూ పూర్తి చేయలేడు. ‘శాకుంతలం’ విషయంలో ఇదే జరిగింది. సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమా ఇది. రూ.50 కోట్లలో ఈ సినిమా పూర్తి చేయాలనుకొన్నాడు.కానీ ఇప్పుడు మొత్తం బడ్జెట్ రూ.65 కోట్లు దాటేసింది. ఇంకా ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఉన్నాయి. సమంత ఇప్పుడు అనారోగ్యం పాలైంది. ఆమె కోలుకొని రావడానికి టైమ్ పడుతుంది. `శాకుంతలం` కూడా ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. దాంతో.. ఈ సినిమాపై వడ్డీల భారం పడబోతోంది.
అయినా గుణశేఖర్ ధీమాగానే ఉన్నాడు.ఎందుకంటే ‘శాకుంతలం’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేద్దామనుకొంటున్నాడు. ఇదో విజువల్ ఫీస్ట్ కాబట్టి… భాషకు అతీతంగా ఈసినిమా చూస్తారన్నది గుణశేఖర్ నమ్మకం. త్వరలో `యశోద` రిలీజ్ కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ‘యశోద’ హిట్టయి, మంచి లాభాలొస్తే… `శాకుంతలం`కు అది ప్లస్ అవుతుంది. అందుకే `యశోద` రిజల్ట్ ఏమవుతుందా? అని గుణశేఖర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నవంబరు 11న `యశోద` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.