తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ అంత ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలను సాధారణంగా మూడు, నాలుగు వారాల పాటు నిర్వహిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం నాలుగైదు రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మామూలుగా అయితే గవర్నర్ ప్రసంగం లేకుండానే తొలి రోజే బడ్జెట్ పెట్టి.. తర్వాత రెండు రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ గవర్నర్ ప్రసంగం తప్పని సరి అవడంతో బడ్జెట్ ను ఆరో తేదీకి మార్చుకున్నారు. తొలి రెండు రోజులు గవర్నర్ ప్రసంగం.. ఆ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతో ముగిసిపోయింది.
ఆరో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. . ఈనెల 7న అసెంబ్లీకి సెలవు కాగా.. 8 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగుతుంది. 9,10,11 తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. ఈ నెల 12 ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే విపక్షాలు మాత్రం కనీసం ఇరవై రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అన్ని సమస్యలపై చర్చించాలంటున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఆ మూడ్లో లేరని బీఆర్ఎస్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
మార్చి వరకూ డెడ్ లైన్ పెట్టుకుని అన్ని రకాల పనుల్ని పూర్తి చేస్తున్నారు. పదిహేడో తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీనిరద్దు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బడ్దెట్ ను కూడా ఆమోదించినందున ఇక ఏ సమస్యా ఉండదని.. అంటున్నారు. సాధారణంగా బడ్జెట్ను మార్చిలో ప్రవేశ పెడతారు. ఈ సారి ముందుగానే ప్రవేశ పెట్టడానికి.. ముందస్తు ఆలోచనలే కారణమంటున్నారు.