బడ్జెట్ ఎవర్నీ మెప్పించలేదు. సాధారణంగా బీజేపీ ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశ పెడితే స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా స్పందిస్తాయి. ఈ స్పందన పాజిటివ్ గానే ఉంటుంది. నెగెటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు .కానీ ఈ సారి మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. స్టాక్ మార్కెట్ ఈ బడ్జెట్ చూసి భయపడిపోయింది. ఇన్వెస్టర్లు హడలిపోయారు. ఈ దెబ్బకు.. ఒక్క రోజే అక్షరాలా 3 లక్షల 60వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. శనివారం సెలవు అయినా, బడ్జెట్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్‌లో… సూచీలు నేలచూపులు చూశాయి. నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలేవీ రుచించకపోవడం వల్ల సెన్సెన్స్, నిఫ్టీ జారుడుబండగా మారాయి.
బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యేదాకా అటూ ఇటూగా ఉన్న మార్కెట్లు.. ఆమె కీలక అంశాల్ని ప్రస్తావించగానే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రసంగం పూర్తయ్యాక… ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఒక దశలో ఏకంగా ఒక వెయ్యి 50 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్… చివరికి 988 పాయింట్ల నష్టంతో ముగిసింది. గత 11 ఏళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున స్టాక్‌మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్, ఆటో రంగంపై జీఎస్టీ తగ్గింపు లాంటి ఆశాజనక వార్తలేవీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐటీ, FMCG రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు తప్ప… మిగతా అన్ని రంగాలకు చెందిన కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా, మెటల్ షేర్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. సంపద పెంచే వాళ్లని గౌరవిస్తామని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా చెప్పారు కానీ.. అలాంటి సూచనలేమీ నిర్ణయాల్లో స్టాక్ మార్కెట్లకు కనిపించలేదు. ఆ ఫలితం 3 లక్షల 60 వేల కోట్ల సంపద లాస్.